Nellore: ‘నన్నెవరూ ఏమీ చేయలేరు’.. కావలిలో మహిళపై వైకాపా నేత దాష్టీకం

‘నన్నెవరూ ఏమీ చేయలేరూ, పోలీసులు కూడా మేం చెప్పినట్లే వింటారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో’ అని ఓ మహిళపై వైకాపా నేత నలుగురితో కలిసి దాడి చేయించిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది.

Updated : 29 Jun 2023 15:54 IST

కావలి: నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నేత రెచ్చిపోయాడు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీ డబ్బులు ఇంకా చెల్లించాలంటూ నలుగురితో కలిసి జులుం ప్రదర్శించాడు. ‘నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీకు దిక్కున్న చోట చెప్పుకో’మని ఆమెపై దాడి చేయించాడు. అయితే, అప్పు తీసుకున్న డబ్బులకు వడ్డీతో సహా చెల్లించానని బాధిత మహిళ చెబుతుండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

వైకాపా నేత మహేంద్ర దగ్గర కరకమిట్ల పార్వతి అనే మహిళ ఏడాది క్రితం రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తానికి అసలుతో పాటు రూ.50వేలు వడ్డీ కూడా చెల్లించినట్లు ఆమె చెప్పారు. మహేంద్రకు వడ్డీతో సహా అప్పు మొత్తం తీర్చేశానని తెలిపారు. శనివారం రాత్రి ఇంకా రూ.65 వేలు వడ్డీ డబ్బులు చెల్లించాలంటూ యువకులతో కలిసి వైకాపా నేత దాడి చేయించాడని పార్వతి ఆరోపించారు. చేసేదేమీ లేక ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పారు. వెంటనే పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే పార్వతికి చికిత్స కొనసాగుతోంది. 

ఈ విషయం గురించి మీడియా బాధితురాలిని ప్రశ్నించగా.. ‘‘నన్ను ఎవరూ ఏమీ చేయలేరూ, పోలీసులు కూడా మేం చెప్పినట్లే వింటారు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమని మహేంద్ర చితకబాదారు’’ అని బోరున విలపించారు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని