China: పొరుగునున్న చైనాతో జాగ్రత్త

పొరుగున ఉన్న చైనాతో జాగ్రత్తగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను తాను హెచ్చరించానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు.

Updated : 17 Jun 2021 07:57 IST

పుతిన్‌ను హెచ్చరించిన బైడెన్‌
ముగిసిన జెనీవా శిఖరాగ్ర భేటీ

జెనీవా: పొరుగున ఉన్న చైనాతో జాగ్రత్తగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను తాను హెచ్చరించానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ప్రచ్ఛన్నయుద్ధం నాటి రోజులు కావని, సరిహద్దుల్లోని చైనా దూకుడును గమనించాలని తాను కోరినట్లు తెలిపారు. రష్యాతో సన్నిహిత సంబంధాలకు అమెరికా సిద్దంగా ఉందని, ఈ చర్చలను మున్ముందు కూడా కొనసాగిస్తామని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. చర్చలపై సంతృప్తి వ్యక్తంచేశారు. నిర్మాణాత్మకంగా సాగాయని అన్నారు. అమెరికాతో ఎలాంటి విరోధం లేదని తెలిపారు. అమెరికా-రష్యా మధ్య సంబంధాలు ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి స్థాయికి దిగిజారిపోయాయని అందరూ భావిస్తున్న తరుణంలో బుధవారం జో బైడెన్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో రెండున్నరగంటలకు పైగా చర్చలు జరిపారు. అనంతరం విడివిడిగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. పుతిన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. బైడెన్‌ అనుభవమున్న వ్యక్తి అని అన్నారు ‘‘చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌ భిన్నమైన వ్యక్తి’’ అని పుతిన్‌ చెప్పారు. రాయబారుల అంశంపై రెండు దేశాలు అవగాహనకు వచ్చినట్లు పుతిన్‌ తెలిపారు. రష్యా హ్యాకర్లు తమ సంస్థలపై దాడి చేశారని పేర్కొంటూ.. ఆ దేశ రాయబారులను బైడెన్‌ ప్రభుత్వం వెనక్కి పంపింది. అంతకుముందు రష్యా అదే పని చేసింది. ఈ చర్చల్లో ఆ సమస్య పరిష్కారమైనట్లు పుతిన్‌ పేర్కొన్నారు. సైబర్‌ దాడుల అంశంపై అడిగిన ప్రశ్నకు పుతిన్‌ ఎదురు దాడి చేశారు. అమెరికాయే సైబర్‌ దాడులు చేసిందన్నారు. ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ నిర్బంధాన్ని పుతిన్‌ సమర్థించుకున్నారు. నావల్నీ రష్యా చట్టాలను ఉల్లంఘించారని తెలిపారు. తనపై కేసులున్నాయని తెలిసి కూడా ఆయన దేశం విడిచి పారిపోయారని చెప్పారు.

అలెక్సీ నావల్నీ విషయం ప్రస్తావించా
రష్యాలో మానవ హక్కుల ఉల్లంఘనను, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీను  నిర్బంధించిన విషయాన్ని పుతిన్‌తో సమావేశంలో తాను ప్రస్తావించానని బైడెన్‌ తెలిపారు. ‘‘అమెరికా అధ్యక్షుడిగా మానవహక్కుల గురించి ఎలా మాట్లాడకుండా ఉంటాను. అలెక్సీ నావల్నీ లాంటి అంశాలను ఎప్పటికీ అమెరికా లేవనెత్తుతూనే ఉంటుంది’’ అని బైడెన్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా విలేకరులకు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని