భారత్‌లో 3కోట్ల కరోనా టెస్టులు..!

ఆగస్టు 16వరకు దేశంలో మొత్తం 3కోట్ల 41వేల (3,00,41,400) శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.

Published : 17 Aug 2020 12:00 IST

నిన్న ఒక్కరోజే 7లక్షల 31వేల శాంపిళ్లకు పరీక్ష

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఆయా ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా నిత్యం దాదాపు 6నుంచి 8లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే మరో 7లక్షల 31వేల శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. దీంతో ఆగస్టు 16వరకు దేశంలో మొత్తం 3కోట్ల 41వేల (3,00,41,400) శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఆగస్టు 12వ తేదీన ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8లక్షల 30వేల పరీక్షలు నిర్వహించారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొవిడ్‌ టెస్టులు అధికంగా చేపడుతున్నారు. బిహార్‌, గుజరాత్‌, యూపీ, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కొవిడ్‌ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో కొవిడ్‌ టెస్టుల సంఖ్య భారీగా పెంచాల్సి ఉందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించిన విషయం తెలిసిందే.

భారీగా పెరిగిన కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాలు..

దేశంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది. జనవరి 23వరకు దేశంలో ఒకేఒక్క టెస్టింగ్‌ కేంద్రం ఉండగా మార్చి 23వరకు ఆ సంఖ్య 160కు పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు 1470 కేంద్రాలకు ఐసీఎంఆర్‌ అనుమతినిచ్చింది. వీటిలో 969 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా, 501 ల్యాబ్‌లు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాయి. దేశంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్‌టీ-పీసీఆర్‌తోపాటు ట్రూనాట్‌, సీబీనాట్‌ విధానాలను అనుసరిస్తున్నారు.

ప్రపంచంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే 7కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అధిక టెస్టులు చేస్తోన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ట్రంప్‌ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న రష్యాలోనూ కొవిడ్‌ టెస్టులు భారీస్థాయిలో చేపడుతున్నారు. ఇప్పటికే అక్కడ 3కోట్లు టెస్టులు చేసినట్లు సమాచారం. ఇక కరోనా వైరస్‌కు మూలకారణమైన చైనాలో ఇప్పటివరకు 9కోట్ల మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు చైనా మీడియా పేర్కొంది. కానీ, దీనిపై చైనా ప్రభుత్వం అధికారిక ప్రకటన మాత్రం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని