మరో సీఎంకు కరోనా పాజిటివ్‌

కరోనా వైరస్‌ సోకిన రాజకీయ ప్రముఖుల జాబితాలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ చేరిపోయారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వారం వ్యవధిలో తనను కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని..

Updated : 29 Feb 2024 15:50 IST

ఛండీగఢ్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకిన రాజకీయ ప్రముఖుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అమిత్‌షా, కైలాస్‌చౌదరి తదితర కేంద్ర మంత్రులతోపాటు పలువురు ఎంపీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ చేరిపోయారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వారం వ్యవధిలో తనను కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఖట్టర్‌ కోరారు.

‘‘ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత వారం రోజుల్లో నన్ను కలిసిన వారు కచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ ఖట్టర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. హరియాణా అసెంబ్లీ సభాపతి గియన్‌ చంద్‌ గుప్తాకు కూడా కరోనా సోకడంతో ఆగస్టు 26 నుంచి జరగబోయే సమావేశాలను ఉపసభాపతి రణ్‌వీర్ గంగ్వా నిర్వహించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మంత్రి అనిల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని