PhonePe: మధ్యప్రదేశ్‌ సీఎంపై పోస్టర్లు.. కాంగ్రెస్‌కు ఫోన్‌పే హెచ్చరిక..!

మధ్యప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అంటించిన పోస్టర్లు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. వాటిపై ఉన్న చిత్రాలపై ఫోన్‌పే(PhonePe) అభ్యంతరం వ్యక్తమైంది.

Updated : 29 Jun 2023 15:20 IST

భోపాల్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టర్ వార్‌ మొదలైంది. అయితే, భాజపాను ఉద్దేశించి కాంగ్రెస్(Congress) వెలువరించిన పోస్టర్లపై అభ్యంతరం వ్యక్తమైంది. డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే(PhonePe) ఈ పోస్టర్లపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌(Congress)కు హెచ్చరిక పంపింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భాజపా, కాంగ్రెస్ పోస్టర్ వార్‌ మొదలుపెట్టాయి. ఆ పోస్టర్ల మీద ప్రత్యర్థి ఫొటోతో పాటు క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) ఫొటోలు, క్యూఆర్‌ కోడ్స్‌ ఉంటున్నాయి. అంతేగాకుండా ఫోన్‌పే (PhonePe) బ్రాండ్ నేమ్‌, లోగో కూడా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి.. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పని జరగాలంటే 50 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించింది. ఇప్పుడు దీనిపై ఫోన్‌పే స్పందించింది.

‘మా బ్రాండ్‌ లోగో దుర్వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాకు ఏ రాజకీయ పార్టీ లేక ప్రచారంతో సంబంధం లేదు. ఫోన్‌పే (PhonePe) లోగో.. మా సంస్థకు చెందిన రిజిస్టర్ ట్రేడ్‌మార్క్‌. దీని అనధికారిక వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుంది. మా బ్రాండ్‌ లోగో, రంగుతో ఉన్న పోస్టర్లు, బ్యానర్లను తొలగించాలని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌కు వినమ్రంగా అభ్యర్థిస్తున్నాం’ అని ఫోన్‌పే ట్విటర్ వేదికగా స్పందించింది. 

గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బసవరాజ్‌ బొమ్మై సర్కారుపై కాంగ్రెస్ ఇలానే విమర్శలు చేసింది. 40 పర్సెంట్ సర్కార్ అని, పేసీఎం అని పోస్టర్లు అంటించి, ప్రచారం చేసింది. ఇదిలా ఉంటే.. ‘వాంటెడ్ కమీషన్‌నాథ్‌’ అంటూ మధ్యప్రదేశ్‌లో ఈ పోస్టర్ వార్‌కు భాజపా(BJP)నే తెరలేపిందని కాంగ్రెస్(Congress) ఆరోపించింది. అయితే వీటిని భాజపా ఖండించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు