Agniveer: ఆరు నెలల శిక్షణతో ‘చైనా’ సైనికుడితో పోరాడలేరు: ‘అగ్నివీర్‌’పై రాహుల్‌

కేవలం ఆరునెలలు శిక్షణ తీసుకున్న ‘అగ్నివీర్‌’.. ఐదేళ్లు శిక్షణ పొందిన చైనా సైనికులతో పోరాడలేరని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Published : 09 Apr 2024 00:02 IST

భోపాల్‌: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకంపై రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. కేవలం ఆరునెలలు శిక్షణ తీసుకున్న ‘అగ్నివీర్‌’.. ఐదేళ్లు శిక్షణ పొందిన చైనా సైనికుడితో పోరాడలేరని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ.. ప్రధానమంత్రి రూపొందించిన ఈ పథకాన్ని భారత ఆర్మీ కోరుకోవడం లేదన్నారు.

‘‘గతంలో పేదలు సైన్యంలో చేరేవారు. పెన్షన్‌తోపాటు ఇతర హోదా పొందేవారు. క్యాంటీన్‌ సౌకర్యం కూడా ఉండేది. కానీ, ఇప్పుడు అగ్నివీరులను తయారు చేస్తున్నామని, వారికి ఆరు నెలల శిక్షణ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. చైనా సైనికులు మాత్రం ఐదేళ్ల శిక్షణ పొందుతున్నారు. ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అమరుడైతే ‘అగ్నివీర్‌’ అయినందువల్ల అమరవీరుడి హోదా కూడా లభించదు’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

తాము కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచామన్నారు. ఈ పథకంపై ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుందని, దీనిపై ఆర్మీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని