Delhi: అనారోగ్యమైతే ప్రమాణ స్వీకారం ఆపాలా..? ఇదేం వింత..! దిల్లీ ప్రభుత్వంపై ఎల్జీ ఆగ్రహం

అనారోగ్యం కారణంగా దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (DERC) కొత్త ఛైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయడంపై ఎల్జీ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు లేఖ రాశారు.

Updated : 04 Jul 2023 12:23 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీ(Delhi)లో లెఫ్టినెంట్ గవర్నర్‌(Delhi Lt Governor), ఆప్‌ ప్రభుత్వం(AAP Govt) మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (DERC) కొత్త ఛైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. తన అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆప్‌ నేత, విద్యుత్ శాఖ మంత్రి అతిషి వాయిదా వేయగా.. డిజిటల్ యుగంలో ఇదేం తీరు అంటూ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా( Delhi Lieutenant Governor VK Saxena) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఆయన లేఖ రాశారు. 

‘ఈ డిజిటల్ యుగంలో రాష్ట్రపతి 2023 జూన్‌ 21న ఇచ్చిన నోటిఫికేషన్‌ను అమలు చేయకలేకపోతున్నట్లు మంత్రి వెల్లడించడం వింతగా అనిపిస్తోంది’ అని సక్సేనా అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రక్రియను వర్చువల్‌గా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ ఉదయం పదిగంటలకు దానిని పూర్తి చేయాలని వెల్లడించగా.. ఆ సమయానికి ఎల్‌జీ ఆదేశాలు అమలుకాలేదు.

ఏం జరిగిందంటే..?

జస్టిస్‌ ఉమేశ్‌ కుమార్.. అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఆయన దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (DERC) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వాస్తవంగా మంత్రి అతిషి సోమవారం సాయంత్రం ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారని దిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దానికి సంబంధించి జస్టిస్ ఉమేశ్‌కు సమాచారం ఇచ్చారు. దానికి ఆయన కూడా అంగీకరించారు. తర్వాత అనూహ్యంగా అతిషి అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆ కార్యక్రమం కాస్తా గురువారానికి వాయిదా పడింది.

సుప్రీంకోర్టులో ఎల్జీకి చుక్కెదురు..

దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్‌ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను ఆప్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో ప్రస్తుత నియామకం మరోసారి ఆప్‌ ప్రభుత్వం, ఎల్జీ మధ్య విభేదాలు సృష్టించింది. దీనిని ఆప్‌ సుప్రీంకోర్టులో సవాలు చేయగా..  కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఈ ప్రమాణ స్వీకారాన్ని కోర్టు వాయిదా వేసింది. జస్టిస్‌ ఉమేశ్ కుమార్ ప్రమాణ స్వీకారం నిర్వహణ గురించి లెఫ్టినెంట్‌ గవర్నర్ వీకే సక్సేనా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అడగకూడదని ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు ఇస్తామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని