Nitish Kumar: జనాభా నియంత్రణపై నీతీశ్‌ వ్యాఖ్యలు వివాదాస్పదం.. భాజపా ఫైర్!

మహిళలు విద్యావంతులైనప్పుడు మాత్రమే జనాభా పెరుగుదల అదుపులోకి వస్తుందని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

Published : 09 Jan 2023 01:16 IST

 

పట్నా: జనాభా నియంత్రణపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రంలో జనాభా నియంత్రణకు పురుషులు బాధ్యత తీసుకోరని, మహిళలు కూడా నిరక్షరాస్యులుగా ఉండిపోతుండటంతో ఇది సాధ్యపడటం లేదని నీతీశ్‌ వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలను ప్రతిపక్ష భాజపా తప్పుబట్టింది. ముఖ్యమంత్రి అసభ్య పదజాలంతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగాజారుస్తున్నారంటూ విమర్శించింది.

‘‘మహిళలు విద్యావంతులైనప్పుడు మాత్రమే జనాభా పెరుగుదల అదుపులోకి వస్తుంది. వారు విద్యాధికులైతే గర్భం దాల్చకుండా ఏమేం చేయాలనే దానిపై వారికి అవగాహన ఉంటుంది. ఈ విషయంలో మగవారు నిర్లక్ష్యంగా ఉంటారు. మహిళలు నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల అణచివేతకు గురవుతూ.. జనాభా నియంత్రణను కట్టడి చేయలేకపోతున్నారు. వారు విద్యావంతులైతేనే, జనాభా నియంత్రణ సాధ్యమవుతుంది’’ అని నీతీశ్‌ వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం నీతీశ్‌ కుమార్‌ ‘సమాధాన్‌ యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.  ఇందులో భాగంగా వైశాలిలో ఏర్పాటు చేసిన సభలో నీతీశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శనివారం నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టారు. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణపై నీతీశ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సీఎం నీతీశ్‌ వ్యాఖ్యలను ప్రతిపక్ష భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రాష్ట్ర ప్రతిష్ఠను, ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజారుస్తున్నారని భాజపా శాసనసభా పక్ష నేత సామ్రాట్‌ చౌదరి మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని