కలకలం రేపిన ఐఏఎస్‌ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!

పంజాబ్‌లో ఐఏఎస్‌ అధికారి కుమారుడి మృతి తీవ్ర కలకలం రేపింది. ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్లి కుమారుడు కార్తిక్ పోప్లి(27) అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు.......

Published : 26 Jun 2022 01:37 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో ఐఏఎస్‌ అధికారి కుమారుడి మృతి తీవ్ర కలకలం రేపింది. ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్లి కుమారుడు కార్తిక్ పోప్లి (27) అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. అవినీతి కేసులో జూన్ 21న సంజయ్ అరెస్టు కాగా.. విజిలెన్స్ అధికారుల బృందం విచారణ నిమిత్తం చండీగఢ్​లోని ఆయన ఇంటికి శనివారం వెళ్లింది. ఈ సమయంలోనే కాల్పుల శబ్దం వినిపించిందని అధికారులు పేర్కొంటున్నారు. లైసెన్స్‌ ఉన్న తుపాకీతో కార్తిక్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు.

అయితే మృతుడి కుటుంబీకులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఐఏఎస్‌ భార్య పేర్కొన్నారు. వారు నమోదు చేసిన కేసుకు మద్దతుగా తప్పుడు స్టేట్​మెంట్లు ఇవ్వాలని తమ ఇంట్లోని పనివాళ్లపైనా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ‘విజిలెన్స్‌ అధికారులే నా కుమారుడిని చంపేశారు. దీనికి సీఎం భగవంత్ మాన్ సమాధానం చెప్పాలి. దీనిపై నేను కోర్టుకు వెళ్తా’నంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

కార్తిక్‌ మృతిపట్ల పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘అనుమానాస్పద రీతిలో కుమారుడిని కోల్పోయిన సంజయ్‌ పోప్లికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చట్టాన్ని చేతిలోకి తీసుకొని, స్వార్థ ప్రయోజనాల కోసం విలువైన జీవితాన్ని కాలరాయడం క్షమించరాని నేరం’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని