Lalu Prasad Yadav: లాలూకు షాక్‌.. బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీంకు సీబీఐ

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav)కు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆయన బెయిల్‌ను సీబీఐ.. సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

Updated : 18 Aug 2023 17:05 IST

దిల్లీ: కిడ్నీ సంబంధిత సమస్య నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav)కు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) షాకిచ్చింది. దాణా కుంభకోణం (fodder scam) కేసుల్లో ఆయనకు మంజూరైన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 25న విచారించనుంది.

దాణా కుంభకోణానికి (fodder scam) సంబంధించిన పలు కేసుల్లో జైలు శిక్ష పడిన లాలూ ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా ఝార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన లాలూ (Lalu Prasad Yadav) గతేడాది డిసెంబరులో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన కుమార్తె రోహిణి తండ్రికి కిడ్నీ దానం చేశారు. ఆ ఆపరేషన్‌ తర్వాత లాలూ కోలుకున్నారు. ఇటీవల విపక్షాల ఉమ్మడి కూటమి సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ (CBI) సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఎఫెక్ట్‌.. కోటాలో కొత్త రకం ఫ్యాన్లు..!

బిహార్‌లో 1996లో దాణా కుంభకోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొత్తం రూ.950 కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. దుమ్కా, దేవ్‌గఢ్‌, ఛాయ్‌బాసా కోశాగారాల నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించారనే ఆరోపణలు వచ్చాయి. 1991 నుంచి 1996 వరకు పలు దఫాల్లో విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.

ఈ ఐదు కేసుల్లోనూ ఆయన దోషిగా తేలారు. తొలి నాలుగు కేసుల్లో మొత్తంగా 14 ఏళ్ల జైలు శిక్ష పడగా..  నకిలీ బిల్లులు చూపించి డోరండా ట్రెజరీ నుంచి రూ.139.50 కోట్లు కొల్లగొట్టారన్న చివరి కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసుల్లో మూడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన లాలూ.. అనారోగ్య కారణాలతో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ శిక్షలపై ఆయన చేసిన అప్పీళ్లు పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని