CBI: ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు

హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ యాప్‌ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది.

Published : 01 May 2024 13:46 IST

దిల్లీ: ఆన్‌లైన్‌లో మోసపూరిత యాప్‌లపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ యాప్‌ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 30 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ సహా దిల్లీ, రాజస్థాన్‌, యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ దాడులు జరిపినట్లు సీబీఐ ప్రకటించింది.

హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ యాప్‌ మోసంలో పాత్ర ఉందన్న ఆరోపణలపై షిగూ టెక్నాలజీ ప్రై.లిమిటెడ్‌, లిలియన్‌ టెక్నోక్యాబ్‌ ప్రై.లిమిటెడ్‌ కంపెనీలు సహా ఆయా సంస్థల డైరెక్టర్లపై సీబీఐ ఇదివరకే కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా పది రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి వరకు దాడులు జరిపి ముఖ్యమైన డిజిటల్‌ ఆధారాలను సీజ్‌ చేసింది. ఈ మెయిల్‌లతోపాటు మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్‌ హార్డ్‌డ్రైవ్‌లు, సిమ్‌ కార్డులు, ఏటీఎం/డెబిట్‌ కార్డులు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించేందుకు నిందితులు దాదాపు 150 బ్యాంకు అకౌంట్లను ఉపయోగించినట్లు సీబీఐ గుర్తించింది. క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌ మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు వస్తాయంటూ ఈ రెండు సంస్థలు వినియోగదారులను ప్రలోభపెట్టాయని సీబీఐ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని