CBSE: జులై 31నాటికి 12వ తరగతి ఫలితాలు!

జులై 31లోగా సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు గురువారం కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క అదే రోజున సీఐఎస్‌సీఈ ఫలితాలకు వెల్లడించాలని భావిస్తోంది.  

Updated : 15 Oct 2022 16:57 IST

సుప్రీంకు వెల్లడించిన కేంద్రం

దిల్లీ: జులై 31నాటికి సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క అదే రోజున సీఐఎస్‌సీఈ ఫలితాలకు వెల్లడించాలని భావిస్తోంది. సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలపై సుప్రీం కోర్టులో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. అలాగే మూల్యాంకన ప్రాతిపాదనల వివరాలను సీబీఎస్‌ఈ కోర్టుకు వెల్లడించింది. 10,11 తరగతులకు 30 శాతం వెయిటేజీ, 12వ తరగతికి 40 శాతం వెయిటేజీ ఇచ్చి  12వ తరగతి మార్కులను నిర్ణయించనున్నట్లు వివరించింది. 12వ తరగతిలో ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం మార్కులు, 11వ తరగతి ఫైనల్ పరీక్షల ఆధారంగా 30 శాతం మార్కులు కేటాయించనున్నారు. అదే 10  తరగతికి సంబంధించి ఐదు పేపర్ల నుంచి మెరుగైన మార్కులున్న మూడు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంది.  ప్రాక్టికల్స్‌ విషయంలో పాఠశాలలు సమర్పించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు పరీక్షలు నిర్వహించిన సమయంలో హాజరుకావచ్చని కేంద్రం వెల్లడించింది.   

జూన్‌ మొదటి వారంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల రద్దు నిర్ణయానికి ప్రధాని నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు. పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని విశ్లేషించిన నేపథ్యంలో ఆ వివరాలన్నింటినీ విద్యాశాఖ అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. నిర్దేశిత ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట గడువులోపు ఫలితాల వెల్లడికి బోర్డు చర్యలు తీసుకోనుంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల నమోదు నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని రద్దు నిర్ణయం తీసుకొన్నామని ప్రధాని వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని