Jammu and Kashmir: 14 యాప్స్‌ను బ్లాక్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఉపయోగించే యాప్స్‌ను కేంద్రం బ్లాక్‌ చేసింది. పాక్‌ నుంచి ఉగ్రనాయకులు వీటి ద్వారా కశ్మీర్‌లోని కార్యకర్తలకు సందేశాలు పంపుతున్నట్లు గుర్తించారు.

Updated : 01 May 2023 15:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రవాదుల కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్‌(Jammu and Kashmir)లోని క్షేత్రస్థాయి ఉగ్రవాదులకు పాక్‌ (Pakistan) నుంచి వారి బాస్‌లు కోడెడ్‌ సందేశాలు పంపేందుకు వాడుతున్న 14 మొబైల్‌ యాప్స్‌ను కేంద్రం బ్లాక్‌ చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు కశ్మీర్‌లో క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి, ఇతర ఆపరేటీవ్‌లకు సూచనలు, సందేశాలు పంపేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తేలింది. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్‌ అప్లికేషన్లపై కేంద్రం కొన్నేళ్లుగా చర్యలు తీసుకొంటున్న విషయం తెలిసిందే. కేంద్రం తాజాగా బ్లాక్‌ చేసిన వాటిల్లో క్రిప్‌వైజర్‌, ఎనిగ్మా, సేఫ్‌వైజ్‌, వికర్‌మి, బ్రియార్‌, బీఛాట్‌, నాండ్‌బాక్స్‌, కొనియాన్‌, ఐఎంవో, ఎలిమెంట్‌, సెకండ్‌ లైన్‌, జంగీ, త్రిమా ఉన్నాయి.

దేశంలోని భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ యాప్స్‌ భారత చట్టాలను ఉల్లంఘించడంతోపాటు, జాతీయ భద్రతకు ముప్పుగా మారాయి. దీంతోపాటు ఉగ్రవాదం ప్రచారంలో కూడా వీటిని వాడుతున్నారు ‘‘కశ్మీర్‌లోని క్షేత్రస్థాయి ఉగ్రవాదుల కదలికలు, వారి సమాచార మాధ్యమాలపై ఏజెన్సీలు దృష్టిపెట్టాయి. కొన్ని యాప్స్‌నకు దేశీయంగా ఒక్క ప్రతినిధి కూడా లేని విషయం బయటపడింది. ఇలాంటి వాటిల్లో జరిగే కార్యకలాపాలను గుర్తించడం చాలా కష్టం’’ అని ఓ అధికారి వెల్లడించారు. 

గత కొన్నేళ్లుగా కేంద్రం దాదాపు 250 చైనా యాప్స్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.  దేశ సార్వభౌమాధికారతను, సమగ్రతను కాపాడటానికి, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని వీటిపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. వీటిల్లో టిక్‌టాక్‌, షేరిట్‌, వీఛాట్‌, హెలో వంటి పాపులర్‌ మొబైల్‌ అప్లికేషన్లు ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు