Rahul Gandhi: అధికారంలోనే పుట్టినా.. దానిపై ఆసక్తి లేదు..!

ఇతర రాజకీయ నేతల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 10 Apr 2022 01:28 IST

సీఎం పోస్టు ఇస్తామన్నా మాయావతి ముందుకు రాలేదు: రాహుల్

దిల్లీ: ఇతర రాజకీయ నేతల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టానని వెల్లడించారు. అలాగే బీఎస్పీతో పొత్తు గురించి ప్రస్తావించారు. శనివారం దిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పలు విషయాలపై స్పందించారు. 

‘రాజకీయ నాయకులు అధికారం పొందేందుకు ప్రయత్నిస్తారు. వారు దాని గురించే ఆలోచిస్తారు. ఉదయాన్నే లేచి, అధికారం ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. అదే ఆలోచనతో నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ దేశం మొత్తం అలాంటి నేతలే ఉన్నారు. అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దానికి బదులు దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక ప్రేమికుడు తాను ప్రేమించే వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా.. నేను ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దేశం నాకు ఎంతో ప్రేమను పంచింది. ఇక్కడ ద్వేషాన్ని కూడా చవిచూశాను. కానీ, నాకు కలిగే ప్రతి గాయం ఏదో ఒకటి నేర్పిస్తుంది’ అంటూ తన మనసులో మాటలను బయటపెట్టారు. 

సీఎం పదవి ఆఫర్ చేసినా.. మాయావతి స్పందించలేదు..

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఎన్నికల ముందు పొత్తు నిమిత్తం బీఎస్పీ అధినేత్రి మాయావతిని సంప్రదించామని రాహుల్ అన్నారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేశామని వెల్లడించారు. కానీ ఆమె నుంచి ఏ స్పందనా రాలేదన్నారు. ‘ఈసారి ఎన్నికల్లో మాయావతి పోటీ పడలేదు. అది మీరు చూసుంటారు. మనం పొత్తు పెట్టుకుందాం.. ముఖ్యమంత్రి పదవి మీకే అంటూ ఒక సందేశం పంపాం. కానీ ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ ఓడిపోయింది అది వేరే విషయం. ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితుల గళం వినిపించేందుకు కాన్షీరామ్‌జీ ఎంతో పోరాటం చేశారు. కానీ మాయావతి ఆ గళం కోసం పోరాడేందుకు రాలేదు. అందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు, పెగాసస్ వంటి స్పైవేర్లు. వారితో(ప్రస్తుత ప్రభుత్వం) ప్రజలు మాత్రమే పోరాడగలరు. వారు రాజ్యాంగాన్ని అమలు చేయనివ్వరు. వ్యవస్థల ద్వారా రాజ్యాంగం అమలవుతుంది. ఆ వ్యవస్థలను వారు స్వాధీనం చేసుకున్నారు. వ్యవస్థలు మన చేతిలో లేకపోతే.. రాజ్యాంగమూ మన చేతిలో ఉండదు’ అంటూ కేంద్రంపై మండిపడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని