Corona: దేశంలో వెయ్యి దాటిన జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1  కేసులు 16 రాష్ట్రాలకు వ్యాప్తి చెందాయి.

Published : 12 Jan 2024 17:36 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 ఉపరకం ‘జేఎన్‌.1’ (Subvariant JN.1) కేసుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 1,013 కేసులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కూ ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందినట్లు  ‘ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG)’ వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు కర్ణాటకలో అత్యధికంగా 214 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 70, కేరళ 154, ఆంధ్రప్రదేశ్‌ 189, గుజరాత్‌ 76, గోవా 66, తెలంగాణ, రాజస్థాన్‌ 32 చొప్పున, ఛత్తీస్‌గఢ్‌ 25, తమిళనాడు 22, దిల్లీ 16, ఉత్తర్‌ప్రదేశ్‌ 6, హరియాణా 5, ఒడిశా 3, పశ్చిమబంగాల్‌ 2, ఉత్తరాఖండ్‌లో ఒకటి చొప్పున కేసులు వెలుగు చూశాయి. 

రిలయన్స్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌ విద్యార్థులకు సదవకాశం

మరోవైపు, ఇటీవల కాలంలో దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, అందులోను జేఎన్‌.1 ఉప రకాన్ని గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్‌పై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది.  దీన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణను సమర్థంగా అమలు చేయాలని కోరింది.  

‘జేఎన్‌.1’ ఉప రకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇదివరకే వర్గీకరించిన విషయం తెలిసిందే.  దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. అయితే, దేశంలో ఈ ఉపరకం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం ప్రజలకు సూచిస్తోంది. మరోవైపు, దేశంలో గురువారం ఒక్క రోజే 609 కొత్త కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,368గా ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని