Published : 24 May 2021 15:13 IST

Covid Vaccines: ప్రాణాలకు రక్షణగా నిలుస్తోన్న టీకాలు!

ఆసుపత్రి చేరికలు, మరణాల నుంచి 100శాతం రక్షణ - తాజా అధ్యయనం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి చేస్తోన్న విలయానికి యావత్‌ ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు ఈ మహమ్మారి నుంచి అత్యంత రక్షణ కల్పిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడవుతోంది. వ్యాక్సిన్‌ల వల్ల ఇంగ్లాండ్‌లో ఇప్పటికే 12వేల మరణాలను నిర్మూలించగలిగినట్లు అక్కడి ప్రజారోగ్య విభాగం ఈమధ్యే వెల్లడించింది. ముఖ్యంగా కరోనా వల్ల ఆసుపత్రుల చేరికలు, మరణాల నుంచి వ్యాక్సిన్‌లు అత్యంత రక్షణ కల్పిస్తున్నాయని తాజాగా మరో అధ్యయనం తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన 8 టీకాల ఫలితాలను విశ్లేషించిన అనంతరం అమెరికా పరిశోధకులు తాజా విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు.

మరణాల నుంచి 100శాతం రక్షణ..

కరోనా వైరస్‌ వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ల నుంచి సరాసరి 85శాతం, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరికలు, మరణాల నుంచి 100శాతం రక్షణ కల్పిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా పరిశోధకులు వెల్లడించారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్‌, నొవావాక్స్‌, సినోవాక్‌ బయోటెక్‌, సినోఫార్మ్‌ వ్యాక్సిన్ల పనితీరును పరిశోధకులు విశ్లేషించారు. వీటికి సంబంధించి వివిధ జర్నల్‌లలో, ఇతర మీడియాలో ప్రచురితమైన అన్ని ప్రయోగాల నివేదికలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదిక రూపొందించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనం కోసం అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ నుంచి విరాళం పొందిన ఈ పరిశోధనా బృందం.. వ్యాక్సినేషన్‌ ప్రణాళికలను రూపొందించడంలో ఆయా దేశాలకు ఈ అధ్యయనం శాస్త్రీయపరంగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. రానున్న రోజుల్లో ఈ అధ్యయనాన్ని మరిన్ని వ్యాక్సిన్ల సమాచారంతో నవీకరిస్తామని పరిశోధకులు పేర్కొన్నారు.  

క్లినికల్‌ ప్రయోగాల ఫలితాలనే కాకుండా వాస్తవ ఫలితాలకు సంబంధించిన నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత మోడెర్నా-94.5శాతం, ఫైజర్‌-94.2శాతం, నోవావాక్స్‌-89.3శాతం, ఆస్ట్రాజెనెకా-81.5శాతం, సినోఫార్మ్‌-78.1శాతం, సినోవాక్‌-50,7శాతం సమర్థత కలిగినట్లు తాజా అధ్యయనాన్ని చేపట్టిన పరిశోధకులు అంచనా వేశారు. ఇక వైరస్‌ సంక్రమణను తగ్గించడంలో వ్యాక్సిన్‌ల సరాసరి సామర్థ్యం 54శాతం ఉందని కనుగొన్నారు.

కొత్త రకాలపైనా సమర్థవంతంగా..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న వేళ.. ఊహించని వేగంతో సురక్షిత, సమర్థవంతమైన వ్యాక్సిన్‌లను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ కొత్తగా వెలుగుచూస్తోన్న కరోనా రకాలతో ఇంకా ముప్పు పొంచివుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. యూకేలో వెలుగు చూసిన B.1.1.7 రకంపై సరాసరి 86శాతం, బ్రెజిల్‌ను వణికిస్తోన్న P.1 రకంపై 61శాతం, ఇక దక్షిణాఫ్రికాలో గుర్తించిన B.1.351 రకాన్ని 56శాతం సమర్థవంతంగా వ్యాక్సిన్‌లు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా 176 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ఇప్పటివరకు దాదాపు 165కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఒక్క భారత్‌లోనే దాదాపు 20కోట్ల డోసులను అందించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని