Flight: విమానంలో లైంగిక వేధింపులు.. దిల్లీ పోలీసు, డీజీసీఏకు నోటీసులు

విమానంలో క్యాబిన్‌ సిబ్బందితోపాటు తోటి మహిళా ప్రయాణికులను వేధింపులకు గురిచేసిన ఘటనలో దిల్లీ పోలీస్‌, డీజీసీఏకు దిల్లీ మహిళా కమిషన్‌ (DCW) నోటీసులు జారీ చేసింది.

Published : 18 Aug 2023 19:16 IST

దిల్లీ: విమానం (Flight)లో పలువురు మహిళలను తోటి ప్రయాణికుడు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో దిల్లీ మహిళా కమిషన్‌ (DCW) స్పందించింది. దిల్లీ పోలీసు (Delhi Police)లతోపాటు, పౌర విమానయాన సంస్థ (DGCA)లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించిన కాపీలను దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్ (Swati Maliwal) ఎక్స్‌ (ప్రస్తుతం ట్విటర్‌)లో షేర్‌ చేశారు. 

‘‘బుధవారం దిల్లీ నుంచి ముంబయి వెళుతున్న స్పైస్‌జెట్‌ ఫ్లైట్‌ నెం: 157లో ఒక ప్రయాణికుడు మహిళా క్యాబిన్‌ సిబ్బందితోపాటు, తోటి మహిళా ప్రయాణికులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అనంతరం అనుచిత రీతిలో వారిని ఫొటోలు/వీడియోలు తీస్తూ వేధించాడు. అతని మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించగా అందులో వారికి సంబంధించిన ఫొటోలు/వీడియోలు ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని దిల్లీ మహిళా కమీషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి దిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసు ఎఫ్‌ఐఆర్‌ కాపీని సమర్పించాలి. అలాగే, నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలి’’ అని డీసీడబ్ల్యూ నోటీసుల్లో పేర్కొంది.

మరోవైపు డీజీసీఏకు సైతం డీసీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల గురించి అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఎవరైనా ఫిర్యాదు చేశారా? నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?ఒకవేళ అలాంటి ఫిర్యాదులు అందకుంటే.. దానిపై వివరణ ఇవ్వాలని డీసీడబ్ల్యూ నోటీసుల్లో పేర్కొంది. ఆగస్టు 23లోగా దిల్లీ పోలీసులు, డీజీసీఏ తమ నివేదికలను సమర్పించాలని డీసీడబ్ల్యూ నోటీసుల్లో స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని