Delhi: భవనాల నిర్మాణం, కూల్చివేతలపై మళ్లీ నిషేధం

దేశ రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు, కూల్చివేతలపై అక్కడి అధికారులు తాత్కాలిక నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు.

Published : 05 Dec 2022 01:36 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత (Air Quality) రోజురోజుకూ క్షీణించిపోతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు, కూల్చివేతలపై తాత్కాలిక నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే, అత్యవసర ప్రాజెక్టు నిర్మాణాలకు మినహాయింపునిచ్చారు. గత నెలలో రాజధాని ప్రాంతంలో గాలి స్వచ్ఛత రికార్డు స్థాయిలో క్షీణించి పోవడంతో భవంతుల నిర్మాణం, కూల్చివేతలపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర ఎయిర్‌ క్వాలిటీ ప్యానెల్‌ అక్కడి అధికారులను సూచించింది. దీనిని అమలు చేయడంతో రోజుల వ్యవధిలోనే గాలి నాణ్యత మెరుగుపడింది. దీంతో అధికారులు నిబంధనలను ఎత్తివేశారు. తాజాగా మరోసారి గాలి నాణ్యత పడిపోవడంతో తిరిగి ఆ నిబంధనలు అమలు చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు.

దిల్లీలో ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు రోజు వ్యవధిలో సరాసరి గాలి నాణ్యత సూచీ (Air Quality Index) 407గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా AQI 201-300 మధ్య ఉంటే గాలి నాణ్యత ‘తక్కువ’గా ఉన్నట్లు లెక్క. అదే 301-400 మధ్య నమోదైతే ‘బాగా తక్కువ’గా ఉన్నట్లు, 401-500 మధ్య ఉంటే నాణ్యత తీవ్రంగా  పరిగణిస్తారు. నవంబరు 4 తర్వాత దిల్లీలో గాలి నాణ్యత ఇంత భారీగా తగ్గిపోవడం ఇదే తొలిసారి. ఆ రోజున AQI 447గా నమోదైంది. అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా రోజుల వ్యవధిలోనే సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో నవంబరు 14న నిబంధనలను ఎత్తివేయడంతో AQI అమాంతం పెరిగిపోయింది. దీంతో అధికారులు నివారణ చర్యలను మళ్లీ మొదలు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని