భారత్‌లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్‌ ముప్పు

వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్‌) ముప్పు భారత్‌లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది.

Published : 27 Apr 2024 05:36 IST

దిల్లీ: వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్‌) ముప్పు భారత్‌లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. నివసించే ప్రాంతం ఎత్తు పెరిగేకొద్దీ ముప్పు స్థాయి కూడా పెరుగుతుందని వివరించింది. ఐదేళ్లలోపు వయసున్న 1.65 లక్షల మంది చిన్నారులకు సంబంధించిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. తల్లిదండ్రులకు మూడో సంతానంగా లేదా ఆ తర్వాత పుట్టే పిల్లలకూ, పుట్టినప్పుడు సాధారణం కన్నా చిన్నగా ఉన్న శిశువులకూ ఈ ముప్పు ఎక్కువని వివరించారు. ఈ పరిశోధనలో మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఎత్తయిన ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఆకలి మందగించొచ్చని, ఆక్సిజన్‌, పోషక పదార్థాల శోషణ తగ్గిపోవచ్చని చెప్పారు. పర్వత ప్రాంతాల్లో ఆహార భద్రత కూడా తక్కువని తెలిపారు. అక్కడి ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులు తక్కువగా ఉంటాయని వివరించారు. ఇలాంటి ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, పోషకాహార కార్యక్రమాలను అమలు చేయడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. అక్కడ చిన్నారుల్లో స్టంటింగ్‌ సమస్య 36 శాతంగా ఉందన్నారు. 1.5 ఏళ్ల వయసువారితో పోలిస్తే (27 శాతం) 1.5-5 ఏళ్ల వయసువారి (41 శాతం)లో ఈ ఇబ్బంది ఎక్కువని తేల్చారు. సముద్రమట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తున్న ప్రాంతంలో నివసించేవారితో పోలిస్తే 2వేల మీటర్ల ఎత్తులో ఉండే చిన్నారులకు స్టంటింగ్‌ ముప్పు 40 శాతం ఎక్కువని గుర్తించారు. తల్లి విద్యా స్థాయి కూడా ఈ సమస్యపై ప్రభావం చూపుతోందని వివరించారు. మాతృమూర్తి చదువు స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే.. ఆమె సంతానానికి ఈ ముప్పు తక్కువని తెలిపారు. చదువుకున్నవారికి పోషకాహారంపై అవగాహన ఉండటమే దీనికి కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని