Air India: ప్రైవేటీకరణకు ముందే ఎయిరిండియా బెటర్‌.. ప్రధాని సలహాదారు ఆగ్రహం..!

ఎయిరిండియా (Air India)ను ప్రైవేటీకరించే కంటే ముందే ఆ సంస్థ సేవలు మెరుగ్గా ఉన్నాయని ప్రధాని సలహాదారు వివేక్‌ దెబ్రాయ్‌ అన్నారు. ఎయిరిండియా విమానం ఆలస్యమవడంపై ఆయన మండిపడ్డారు.

Updated : 18 Feb 2023 10:18 IST

దిల్లీ: టాటాల ఆధీనంలో ఉన్న ఎయిరిండియా (Air India)పై ప్రధానమంత్రి (PM) ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ వివేక్‌ దెబ్రాయ్ (Bibek Debroy) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిరిండియాతో విసిగిపోయామని, ప్రైవేటీకరణ కంటే ముందే ఆ విమానయాన సంస్థ మెరుగ్గా ఉందని విమర్శించారు. ముంబయి నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమవడంతో వివేక్‌ ట్విటర్‌ వేదికగా ఎయిర్‌లైన్‌పై మండిపడ్డారు.

‘‘ఎయిరిండియా (Air India)తో విసిగిపోయా. ఈ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో దిల్లీకి టికెట్‌ బుక్‌ చేసుకున్నా. సాయంత్రం 4.35 గంటలకు విమానం బయల్దేరాల్సి ఉంది. కానీ విమానం ఆలస్యమైంది. దానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రైవేటీకరణకు ముందే ఈ సంస్థ సేవలు మెరుగ్గా ఉండేవి’’ అని వివేక్‌ ఎయిర్‌లైన్‌ యాజమాన్యాన్ని విమర్శించారు. ఎక్కువ విమానాలు ఆర్డర్‌ చేసినంత మాత్రాన విమాన సేవలు వాటంతటవే మెరుగు పడవని ఆయన వరుస ట్వీట్లలో ఎద్దేవా చేశారు.

దీనికి ఎయిరిండియా (Air India) బదులిస్తూ.. నిర్వహణ కారణాల రీత్యా విమానం ఆలస్యమైందని తెలిపింది. ప్రయాణికులకు సాయం చేసేందుకు తమ అధికారుల బృందం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని పేర్కొంది. అయితే ఎయిర్‌లైన్‌ స్పందనపైనా వివేక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిరిండియా బృందం ప్రయాణికులకు ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. విమానయాన సంస్థ తీరుతో ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారని అన్నారు. ఇకపై తాను ఎయిరిండియాలో ప్రయాణించబోనని తెలిపారు.

ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎయిరిండియా (Air India) ప్రైవేటీకరణలో భాగంగా గతేడాది జనవరిలో టాటా గ్రూప్‌ (TATA Group) చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సంస్థ 470 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్‌, బోయింగ్‌ సంస్థలకు ఆర్డర్‌ పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని