ఫలించిన 80 ఏళ్ల పోరాటం.. 93 ఏళ్ల మహిళకు దక్కిన ఆస్తి

ఎనిమిది దశాబ్దాల భూ వివాదాన్ని (Property Dispute) బాంబే హైకోర్టు (Bombay HC) పరిష్కరించింది. దక్షిణ ముంబయిలోని రెండు ఫ్లాట్లను ఆ ఇళ్ల అసలైన యజమాని అయిన 93 ఏళ్ల బామ్మకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 06 May 2023 14:20 IST

ముంబయి: వారసత్వ ఆస్తి కోసం ఓ మహిళ చేసిన అలుపెరగని న్యాయ పోరాటం ఫలించింది. ఎనిమిది దశాబ్దాల భూవివాదాన్ని పరిష్కరిస్తూ 93 ఏళ్ల అలిస్‌ డిసౌజాకు ఆ ఆస్తి తిరిగిచ్చేయాలని బాంబే హైకోర్టు (Bombau High Vourt) మహారాష్ట్ర ప్రభుత్వాన్ని (Maharashtra Govt) ఆదేశించింది. దీంతో 80 ఏళ్ల తర్వాత రెండు ఫ్లాట్లు తిరిగి ఆ బామ్మకు దక్కబోతున్నాయి. వివరాల్లోకి వెళితే..

దక్షిణ ముంబయి (South Mumbai)లోని బరాక్‌ రోడ్‌లో ఉన్న రూబీ మాన్షన్‌ (Ruby Mansion) భవనాన్ని 1942 మార్చిలో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం డిఫెన్స్‌ ఆఫ్ ఇండియా (Defence of India) చట్టం కింద తమ అధీనంలోకి తీసుకుంది. అలా ఈ భవనంలోని మొదటి అంతస్తులో అలిస్‌ డిసౌజా కుటుంబానికి చెందిన రెండు ఫ్లాట్లు (500 చదరపు అడుగులు, 600 చదరపు అడుగులు) బ్రిటిష్‌ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాయి.  అనంతరం ఇందులోని ఫ్లాట్లను అప్పటి ప్రభుత్వ అధికారులకు కేటాయించారు. డిసౌజా ఫ్లాట్లను.. డీఎస్‌ లాడ్‌ అనే అధికారికి అప్పగించారు. అప్పట్లో లాడ్‌ సివిల్‌ సర్వీస్‌ విభాగంలో పనిచేసేవారు.

అయితే 1946లో ఈ రిక్విసిషన్‌ (ప్రైవేటు ఆస్తులను బ్రిటిష్‌ పాలకులు స్వాధీనం చేసుకోవడం) ఆదేశాలను ఎత్తివేయడంతో రూబీ మాన్షన్‌లోని ఫ్లాట్లను తిరిగి అసలైన యజమానులకు అప్పగించడం మొదలుపెట్టారు. కానీ, లాడ్‌ కుటుంబం మాత్రం ఈ ఫ్లాట్లను ఖాళీ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో డిసౌజా తండ్రి నాటి కలెక్టర్‌ దగ్గరకు వెళ్లగా.. ఫ్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ లాడ్‌ కుటుంబం ఇళ్లను అప్పగించలేదు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

2010లో కంట్రోలర్‌ ఆఫ్ అకామిడేషన్‌ కూడా ఆ ఫ్లాట్లను ఖాళీ చేయాలని లాడ్‌ కుమారుడు, కుమార్తెకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటికి లాడ్‌ మరణించారు. ఈ ఆదేశాలను అప్పీలేట్‌ అథారిటీ కూడా సమర్థించింది. దీంతో 2012లో లాడ్ వారసులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు కూడా వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. డిసౌజా కుటుంబానికి ఇళ్లను అప్పగించాలని ఆదేశాలిచ్చింది. కానీ, లాడ్‌ వారసులు మాత్రం కోర్టు తీర్పును పాటించలేదు.

దీంతో డిసౌజా మరోసారి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘‘రిక్విసిషన్‌ ఉత్తర్వులను ఉపసంహరించిన తర్వాత ఆ భవనంలోని ఇతర ఫ్లాట్లను అసలైన యజమానులకు అప్పగించారు. మా ఫ్లాట్లను మాత్రం ఇంతవరకూ మేం తిరిగి పొందలేకపోయాం’’ అని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా తీర్పు వెలువరించింది. ఎనిమిది వారాల్లో ఆ రెండు ఫ్లాట్లను ఖాళీ చేయించి డిసౌజాకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని