Watch: చేపల వలకు చిక్కిన డాల్ఫిన్‌ను ఎలా కాపాడారో చూడండి!

చేపల వలకు చిక్కిన రెండు డాల్ఫిన్లను జాలర్లు సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 01 Dec 2022 19:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చేపల వలకు చిక్కిన రెండు డాల్ఫిన్లను జాలర్లు సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులోని రామ్‌నాథపురం జిల్లాలో జాలర్లు చేపలు పడుతుండగా.. అరుదైన జాతులకు చెందిన రెండు డాల్ఫిన్లు వలకు చిక్కాయి. దీంతో వాటిని జాలర్లు జాగ్రత్తగా సముద్రంలోకి విడిచిపెట్టారు. మత్స్యకారుల బృందం తమ వలలో చిక్కుకున్న  డాల్ఫిన్‌లలో ఒకదాన్ని జాగ్రత్తగా బయటకు తీస్తున్న దృశ్యాన్ని సుప్రియా సాహూ పోస్ట్‌ చేసిన వీడియోలో చూడొచ్చు. వలలోంచి దాన్ని విడిపించిన వెంటనే సముద్రపు నీటిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. అయితే, తొలుత డాల్ఫిన్‌ ఈదేందుకు ఇబ్బంది పడగా.. మత్స్యకారులు దాన్ని మరింత లోతుగా ఉండేచోటకు తరలించారు.

ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘‘తమిళనాడు అటవీ బృందం, స్థానిక మత్స్యకారులు ఈరోజు రామనాథపురం జిల్లాలోని కిల్కరై రేంజ్‌లో చేపల వలకు చిక్కిన రెండు డాల్ఫిన్లను విజయవంతంగా రక్షించి సముద్రంలోకి వదిలారు’’ అని సుప్రియా సాహూ పేర్కొన్నారు. వారి కృషిని అభినందిస్తూ నవంబర్‌ 30న బుధవారం పోస్ట్‌ చేసిన ఈ వీడియోను 43వేల మందికి పైగా వీక్షించారు. సుప్రియా సాహూ ప్రస్తుతం తమిళనాడు అటవీ, పర్యావరశాఖ అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మత్స్యకారులు చేసిన పనిని ప్రశంసిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని