Bridge: అదానీ కంపెనీకి చెందిన 6వేల కేజీల ఇనుప వంతెన మాయం..!

ముంబయి (Mumbai)లోని మలాడ్ ప్రాంతంలో జరిగిన దొంగతనం చూసి, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏకంగా ఓ భారీ వంతెనను దుండగులు చోరీ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

Updated : 08 Jul 2023 10:16 IST

ముంబయి: చడీచప్పుడు లేకుండా 90 అడుగుల పొడవైన, 6 వేల కేజీల ఇనుప వంతెన(bridge ) మాయమైంది. నిత్యం బిజీగా ఉండే ముంబయి (Mumbai)లోని మలాడ్ ప్రాంతం ఇది కనిపించకుండా పోయింది. అది అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ (Adani Electricity)కు చెందిన వంతెన అని, ఈ చోరీ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అదానీ సంస్థకు చెందిన భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గత ఏడాది జూన్‌లో మలాడ్‌ ప్రాంతంలోని ఓ కాలువపై ఈ తాత్కాలిక ఇనుప వంతెనను సంస్థ ఏర్పాటు చేసింది. అయితే తర్వాత ఈ ఏప్రిల్‌లో ఆ కాలువపై మరో వంతెన నిర్మించారు. దాంతో ఆ ఇనుప వంతెనను వినియోగించట్లేదు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం 6 వేల కేజీల బరువున్న ఈ వంతెన ఇటీవల కనిపించకుండా పోయింది. రద్దీ ఉండే ప్రాంతం నుంచి అది మిస్‌ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై అదానీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేసిన అధికారులు దొంగతనం జరిగిన తీరును తెలుసుకుని విస్తుపోయారు.

గ్యాస్ కట్టర్లతో వంతెనను ముక్కలుగా చేసి.. ఒక భారీ వాహనంలో దానిని తరలించిట్లు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. అందులో ఒకరికి ఈ వంతెన ఏర్పాటుతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు ఈ వంతెన నిర్మాణం కోసం కాంట్రాక్టు పద్ధతిలో అదానీ సంస్థలో పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురు అతడికి సహకరించారని వెల్లడించారు. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా..? అనేదానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని