ISRO: ఇస్రో నియామక రాతపరీక్ష రద్దు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ‘విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్షను రద్దుచేశారు.

Updated : 22 Aug 2023 09:43 IST

వేరేవారి బదులు హాజరైన ఇద్దరు నిందితుల అరెస్ట్‌
మోసాలపై కేరళ పోలీసుల దర్యాప్తు

తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ‘విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్షను రద్దుచేశారు. వేరొకరికి బదులుగా పరీక్షలు రాస్తూ మోసగించారనే ఆరోపణలపై హరియాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీనిపై కేరళ పోలీసులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించగా, ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు వీఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. టెక్నీషియన్‌-బి, డ్రాఫ్ట్స్‌మేన్‌-బి, రేడియోగ్రాఫర్‌-ఏ పోస్టుల కోసం మళ్లీ ఎప్పుడు పరీక్షలు జరిగేదీ వెబ్‌సైట్‌ ద్వారా తెలియపరుస్తామని తెలిపింది. జాతీయస్థాయి పరీక్షను ఒక్క కేరళలోనే 10 కేంద్రాల్లో నిర్వహించారు. వేరేవారికి బదులుగా పరీక్షలు రాస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరితోపాటు హరియాణాకు చెందిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దరిమిలా పరీక్షను రద్దు చేయాలని వీఎస్‌ఎస్‌సీని పోలీసులు కోరారు. హరియాణా నుంచే 400 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో కోచింగ్‌ కేంద్రాల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నిగ్గు తేల్చడానికి కేరళ నుంచి పోలీసుల బృందం హరియాణాకు వెళ్లనుంది. పరీక్షలో ఏదో అక్రమాలు జరుగుతాయంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా ఇన్విజిలేటర్లను అప్రమత్తం చేసినప్పుడు బండారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు. బటన్‌ కెమెరాలతో ప్రశ్నలను స్కాన్‌ చేసి ఎక్కడికో పంపించి, చెవిలో అమర్చుకున్న పరికరంతో సమాధానాలు విని పరీక్షలు రాశారని, ఆ పరికరాలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని