G20 Summit: ఐటీసీ మౌర్యలో బైడెన్‌

జీ20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న దేశాధినేతల బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియాసహా జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధుల కోసం దిల్లీలోని అత్యంత ఖరీదైన హోటళ్లను సిద్ధం చేశారు.

Updated : 08 Sep 2023 09:47 IST

శాంగ్రీలాలో బస చేయనున్న సునాక్‌

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న దేశాధినేతల బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియాసహా జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధుల కోసం దిల్లీలోని అత్యంత ఖరీదైన హోటళ్లను సిద్ధం చేశారు. ఆయా హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐటీసీ మౌర్యలో బైడెన్‌కు వసతి కల్పించారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు శాంగ్రీలా హోటల్‌లో వసతి కల్పించారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ద లలిత్‌ హోటల్‌లో బస చేయనున్నారు. జపాన్‌ ప్రధాని పుమియో కిషిదా ఇక్కడే ఉంటారని సమాచారం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ఇంపీరియల్‌ హోటల్‌లో బస చేస్తారు. దిల్లీలోని మరో ప్రముఖ హోటల్‌ క్లారిడ్జెస్‌లో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఉంటారు. ఒబెరాయ్‌ హోటల్‌ను తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ బస కోసం కేటాయించారు. గురుగ్రామ్‌ ఒబెరాయ్‌ హోటల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఉంటారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బదులుగా వస్తున్న ఆ దేశ ప్రధాని లీ కియాంగ్‌ బృందం కోసం తాజ్‌ హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు.

‘భారత్‌ వాద్య దర్శనం’లో 78 పరికరాలు

దిల్లీ: జీ20 సదస్సులో ప్రపంచ నేతలను ఆహ్లాద పరిచే ‘భారత్‌ వాద్య దర్శనం’లో 78 సంగీత పరికరాలను వాడనున్నారు. ఇందులో శాస్త్రీయం నుంచి వర్తమాన సంగీత పరికరాల వరకూ ఉన్నాయి. గాంధర్వ ఆటోద్యం బృందం ‘భారత్‌ వాద్య దర్శనం.. మ్యూజికల్‌ జర్నీ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ప్రపంచ నేతలకు శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందు సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుంది. సంగీత పరికరాల్లో సంతూర్‌, సారంగీ, జల్‌ తరంగ్‌, షెహ్‌నాయి తదితరాలున్నాయి. హిందుస్థానీ, కర్ణాటక సంగీతంతోపాటు వర్తమాన సంగీతాలను వినిపిస్తారు. 34 హిందుస్థానీ, 18 కర్ణాటక, 26 జానపద సంగీత పరికరాలను వినియోగిస్తారు. 78 మంది కళాకారులు పాల్గొంటారు. వారిలో 11 మంది పిల్లలు, 13 మంది మహిళలు, ఆరుగురు దివ్యాంగులు, 26 మంది యువకులు, 22 మంది వృత్తి నిపుణులు ఉంటారు.

చాందినీ చౌక్‌లో మహిళా దుబాసీలు

దిల్లీ: జీ20 సదస్సుకు వచ్చే అతిథులతో సంభాషించేందుకు మహిళా దుబాసీలను చాందినీ చౌక్‌ వ్యాపారులు నియమించుకున్నారు. ఆంగ్లం, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, ఇతర భాషలు వచ్చిన 100 మంది మహిళలను వారు ఎంపిక చేసుకున్నారు. ఈ మహిళలు చాందినీ చౌక్‌లోని వ్యాపారులకు, విదేశీ అతిథులకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ వీరు సేవలందిస్తారు. కొంత మంది వాలంటీర్లుగానూ సేవలందించనున్నారు.

9, 10 తేదీల్లో వర్షం పడే అవకాశం!

జీ20 సదస్సు జరిగే 3 రోజులపాటు దిల్లీలో వాతావరణం మిశ్రమంగా ఉంటుందని, 9, 10 తేదీల్లో వర్షం పడే అవకాశముందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. తేలికపాటి జల్లులు పడవచ్చని తెలిపింది. సదస్సు జరిగే రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉండవచ్చని వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26 నుంచి 27 డిగ్రీలు ఉండవచ్చని తెలిపింది. గాలిలో తేమ శాతం గరిష్ఠంగా 70 నుంచి 80 వరకూ ఉంటుందని వివరించింది.


నేడే మోదీ, బైడెన్‌ భేటీ

జీ20కి ముందు ద్వైపాక్షిక చర్చలు

దిల్లీ: భారత్‌, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా శుక్రవారం సాయంత్రం దిల్లీలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు జో బైడెన్‌ చర్చలు జరపనున్నారు. శుద్ధ ఇంధనం, వాణిజ్యం, హైటెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధంపై సమీక్ష జరుపుతారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తారు. బైడెన్‌ శుక్రవారం సాయంత్రం దిల్లీ చేరుకుంటారు. జీ20 సదస్సు ముగిసిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం వియత్నాంకు బయలుదేరి వెళ్తారు.

  • బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మారిషస్‌ అధ్యక్షుడు ప్రవింద్‌ జగన్నాథ్‌తోనూ ప్రధాని మోదీ శుక్రవారం భేటీ అవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని