ఆన్‌లైన్‌ పెళ్లికి కేరళ హైకోర్టు అనుమతి

ఒమిక్రాన్‌ కారణంగా వివాహం ఆగిపోతుందేమోనని భయపడ్డ న్యాయవాదుల జంటకు కేరళ హైకోర్టు అండగా నిలిచింది. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని...

Updated : 24 Dec 2021 07:23 IST

 కొత్త వేరియంట్‌ దృష్ట్యా నిర్ణయం

కోచి: ఒమిక్రాన్‌ కారణంగా వివాహం ఆగిపోతుందేమోనని భయపడ్డ న్యాయవాదుల జంటకు కేరళ హైకోర్టు అండగా నిలిచింది. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికార్లను ఆదేశించింది. న్యాయవాది అయిన రింటు థామస్‌ (25), అనంత కృష్ణన్‌ హరికుమార్‌ నాయర్‌ల పెళ్లి ముందుగా నిర్ణయించిన ప్రకారమయితే గురువారం జరగాల్సి ఉండేది. ఉన్నత చదువుల నిమిత్తం ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న నాయర్‌ బుధవారం స్వస్థలానికి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒమిక్రాన్‌ రకం కరోనా వైరస్‌ కారణంగా ఆ దేశం ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఆయన రావడం సాధ్యం కాలేదు. దాంతో రింటు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్‌లో వివాహం చేసుకోవడానికి అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురంలోని సబ్‌ రిజిస్ట్రార్‌లను ఆదేశించాలని కోరారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.నగరేశ్‌ ఈ వినతిని అంగీకరించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ వివాహాలకు హైకోర్టు అనుమతులు ఇచ్చినందున, ఇప్పుడు కూడా దాన్ని అమలు చేయవచ్చని తెలిపారు. తేదీ, సమయాన్ని నిర్ణయించి ఆన్‌లైన్‌ పెళ్లికి చట్ట ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని వివాహాల అధికారిని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని