రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం

రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్‌కు తెలిపింది.

Updated : 10 May 2024 06:25 IST

ఇజ్రాయెల్‌కు బైడెన్‌ హెచ్చరిక
వెనక్కి తగ్గేదే లేదంటున్న నెతన్యాహు

వాషింగ్టన్‌/జెరూసలెం: రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్‌కు తెలిపింది. ఈ విషయాన్ని తాను ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు స్పష్టం చేశానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ‘సీఎన్‌ఎన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘ఇజ్రాయెల్‌ భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఐరన్‌ డోమ్‌ రాకెట్‌ ఇంటర్‌సెప్టర్లను, ఇతర రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తాం. రఫాపైకి పోతే మాత్రం ఆయుధాలను, ఫిరంగి గుళ్లను పంపించం’’ అని తెలిపారు. విధ్వంసం సృష్టించే భారీ బాంబుల సరఫరాను ఇప్పటికే అమెరికా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే దాడి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇజ్రాయెల్‌ అంటోంది. రఫా ఆపరేషన్‌కు అనుమతి ఇవ్వకపోతే తాము కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించబోమని నెతన్యాహు పేర్కొన్నారు. తగినన్ని ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని, తాము ఒంటరిగానే నిలబడి పోరాడగలిగిన సత్తా ఉందని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు కారణంగా ఉత్తర, మధ్య గాజా ప్రాంతాలను ఖాళీచేసిన సుమారు 12 నుంచి 13 లక్షల మంది పాలస్తీనియన్లు ప్రస్తుతం రఫాలో తలదాచుకుంటున్నారు. ఇందులో హమాస్‌ ఉగ్రవాదులూ ఉన్నారని, ఈ నగరంపై దాడి చేస్తే ఆ సంస్థ అంతమవుతుందని టెల్‌ అవీవ్‌ భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా రఫా క్రాసింగ్‌ను ఆక్రమించింది. నగరాన్ని విడిచి వెళ్లాల్సిందిగా లక్ష మంది పాలస్తీనియన్లకు హెచ్చరికలూ జారీ చేసింది. ఇప్పటికే దాదాపు 80 వేల మంది రఫాను ఖాళీ చేసినట్లు సమాచారం. రఫా క్రాసింగ్‌ను ఆక్రమించిన ఇజ్రాయెల్‌ దళాలు ప్రస్తుతం పరిమిత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నాయి. తాజా దాడిలో 8 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు.  లెబనాన్‌ సరిహద్దుల్లోని ఓ గ్రామం సమీపంలో కారుపై ఇజ్రాయెల్‌ డ్రోన్లు దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరు హెజ్‌బొల్లా ఉగ్రవాదులా కాదా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.

  • రఫా క్రాసింగ్‌ను ఇజ్రాయెల్‌ ఆక్రమించడంతో ఈజిప్టు నుంచి గాజాకు వస్తున్న మానవతా సాయం ఆగిపోయింది. దీంతో ఇంధన కొరత ఏర్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
  • పనామా జెండాలతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఏడెన్‌ జలసంధి దగ్గర క్షిపణులతో దాడిచేసినట్లు గురువారం యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. హిందూ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న మరో నౌకనూ లక్ష్యంగా చేసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని