‘బుజ్జాయి’కి తుది వీడ్కోలు

బుజ్జాయిగా సాహిత్యలోకానికి పరిచయమైన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి అంత్యక్రియలు కుటుంబసభ్యుల సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన గురువారం రాత్రి చెన్నై తిరువాన్మియూరులోని తన స్వగృహంలో

Published : 29 Jan 2022 04:11 IST

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: బుజ్జాయిగా సాహిత్యలోకానికి పరిచయమైన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి అంత్యక్రియలు కుటుంబసభ్యుల సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన గురువారం రాత్రి చెన్నై తిరువాన్మియూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, సాహితీప్రియులు సంతాపం తెలిపారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని సన్నిహితులు తెలిపారు. ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబరు 11న బుజ్జాయి జన్మించారు. చిన్నతనం నుంచి తండ్రి చెంతనే ఉండటంతో పాఠశాలకు వెళ్లలేదు. తండ్రితో ఎక్కువ సమయం గడపటంతో శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ లాంటి గొప్ప వ్యక్తులతో సన్నిహితంగా మెలిగారు. తండ్రి బాటలో తాను నేర్చుకున్న విషయాల్ని, ప్రముఖ కవులు, రచయితలతో తనకున్న అనుబంధాన్ని చాటుతూ ‘నాన్న.. నేను’ పేరిట కథలుగా పుస్తకరూపంలో ప్రచురించారు. 17 ఏళ్ల వయస్సులో ‘బానిస పిల్ల’ పేరిట బొమ్మల పుస్తకం ప్రచురించి కామిక్‌ స్ట్రిప్‌ పుస్తకాలతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ‘బాపు-రమణ’ల బుడుగు లాంటి ‘డుంబు’ కార్టూన్‌ పాత్రను తీసుకొచ్చింది బుజ్జాయే. పంచతంత్ర కథలకు బొమ్మలు వేసి ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీలో ఐదేళ్ల పాటు ధారావాహికలుగా ప్రచురించారు. 5 పుస్తకాలుగా వెలువడిన ఇంగ్లిష్‌ కామిక్స్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి. ‘నవ్వుల బండి డుంబు బొమ్మల కథలు’ అనే పుస్తకాన్ని రచించారు. ఆయన సంతానంలో అందరూ రచయితలే. గత సంవత్సరం 90 ఏళ్లు పూర్తి చేసుకున్న బుజ్జాయిని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని