‘జ్ఞానవాపి’ విచారణ బదిలీ

జ్ఞానవాపి మసీదుపై హిందూ భక్తులు దాఖలు చేసిన సివిల్‌ దావా విచారణ బాధ్యతను సుప్రీం కోర్టు శుక్రవారం వారణాసి సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) నుంచి అక్కడి జిల్లా జడ్జికి బదిలీ చేసింది.

Updated : 21 May 2022 06:17 IST

 వారణాసి జిల్లా న్యాయమూర్తికి బాధ్యత: సుప్రీం కోర్టు ఆదేశం 

దిల్లీ: జ్ఞానవాపి మసీదుపై హిందూ భక్తులు దాఖలు చేసిన సివిల్‌ దావా విచారణ బాధ్యతను సుప్రీం కోర్టు శుక్రవారం వారణాసి సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) నుంచి అక్కడి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. ఈ అంశంతో ముడిపడిన సంక్లిష్టతలు, సున్నితత్వం దృష్ట్యా కేసును 25-30 ఏళ్లు అనుభవమున్న సీనియర్‌ న్యాయాధికారి విచారించడం సబబని పేర్కొంది.  అంతకుముందు విచారణ జరిపిన సివిల్‌ జడ్జిపై తామేమీ ప్రతికూల వ్యాఖ్యలు చేయడంలేదని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. అలాగే.. ఒక ప్రార్థనా స్థల మత స్వభావాన్ని నిర్ధరించే ప్రక్రియను 1991 నాటి చట్టం అడ్డుకోవడంలేదని కీలక వ్యాఖ్య చేసింది. హిందూ భక్తుల దావా విచారణయోగ్యతను ప్రశ్నిస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన దరఖాస్తుపై తొలుత నిర్ణయం తీసుకోవాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. హిందూ భక్తుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి విరుద్ధమని మసీదు కమిటీ అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై నిర్ణయం తీసుకునేవరకూ.. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి అడ్వకేట్‌ కమిషన్‌ దాఖలు చేసిన సర్వే నివేదికను తెరవరాదని కూడా ధర్మాసనం స్పష్టంచేసింది. మసీదులో శివలింగం వెలుగుచూసినట్లు చెబుతున్న ప్రదేశంలో భద్రత కల్పించాలని, ఆ ప్రాంగణంలో ముస్లింలు నమాజ్‌ చేసుకోవచ్చంటూ తామిచ్చిన ఆదేశాలు.. సివిల్‌ దావా విచారణ యోగ్యతపై జిల్లా జడ్జి నిర్ణయం తీసుకునే వరకూ, ఆ తర్వాత మరో 8 వారాల పాటు అమల్లో ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా పేర్కొంది. జడ్జి నిర్ణయంతో విభేదించే వారు ఎగువ కోర్టును ఆశ్రయించడానికి వీలుగా ఈ 8 వారాల సమయాన్ని ఇచ్చినట్లు వివరించింది. నమాజ్‌కు వచ్చే ముస్లింలు వజూ (శుద్ధి) కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని వారణాసి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో వివాదంతో ప్రమేయమున్న అన్ని పక్షాలను సంప్రదించాలని స్పష్టంచేసింది.  క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చక్కబడాలని ధర్మాసనం పేర్కొంది. సర్వేపై అడ్వకేట్‌ కమిషనర్‌ సమర్పించిన నివేదికలోని కొన్ని భాగాల లీకేజీలను అడ్డుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. ‘‘జిల్లా జడ్జి చేతులను సుప్రీం కోర్టు కట్టేయడం తగదు’’ అని హిందూ భక్తుల తరఫున వాదనలు వినిపించిన వైద్యనాథన్‌ పేర్కొన్నారు. సివిల్‌ దావా విచారణయోగ్యతపై న్యాయమూర్తి ఒక నిర్ణయానికి రావాలంటే మొదట సర్వే నివేదికను పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ముస్లింల తరఫు న్యాయవాది హుజేఫా అహ్మదీ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కమిషన్‌ నివేదికలోని కొన్ని భాగాలు లీకయ్యాయయని పేర్కొన్నారు. మసీదుకు సంబంధించి 500 ఏళ్లుగా ఉన్న యథాతథ స్థితిని మార్చేలా సివిల్‌ కోర్టు ఉత్తర్వులిస్తోందన్నారు.  


భారీ భద్రత మధ్య ప్రార్థనలు 

ఈనాడు, లఖ్‌నవూ: జ్ఞానవాపి మసీదులో శుక్రవారం భారీ భద్రత మధ్య ప్రార్థనలు జరిగాయి. కాశీ విశ్వనాథుడి ఆలయంలోని నాలుగో నంబరు గేటు నుంచి ముస్లింలను మసీదులోకి అనుమతించారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించుకునే వజూఖానా ప్రదేశాన్ని సీల్‌ చేసినందువల్ల నమాజ్‌ కోసం ఎక్కువ మంది రావొద్దని, ఇళ్ల సమీపంలోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మసీదు కమిటీ విజ్ఞప్తి చేసింది. అయితే పెద్ద సంఖ్యలో ముస్లింలు అక్కడికి వచ్చారని, వారిని వెనక్కి పంపేశామని కమిటీ సెక్రటరీ ఎం.ఎస్‌.యాసిన్‌ తెలిపారు. శుద్ధి చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం డ్రమ్ముల్లో నీటిని ఏర్పాటు చేసిందన్నారు. మసీదులో సర్వే నిర్వహణకు వారణాసి సివిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ముస్లిం పక్షం వేసిన పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తదుపరి జులై 6న దీనిపై వాదనలు సాగుతాయి. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని