మహమ్మారితో అస్థి నష్టం

కొవిడ్‌ కారణంగా బాధితుల్లో ఎముక నష్టం సంభవిస్తున్నట్టు తాజా పరిశోధనల్లో తేలింది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నప్పుడు, దాని నుంచి కోలుకునే సమయంలోనూ ఈ సమస్య తలెత్తుతున్నట్టు శాస్త్రవేత్తలు

Published : 28 May 2022 06:02 IST

దిల్లీ: కొవిడ్‌ కారణంగా బాధితుల్లో ఎముక నష్టం సంభవిస్తున్నట్టు తాజా పరిశోధనల్లో తేలింది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నప్పుడు, దాని నుంచి కోలుకునే సమయంలోనూ ఈ సమస్య తలెత్తుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎముక జీవక్రియ (బోన్‌ మెటబాలిజమ్‌)పై మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై హాంకాంగ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. కొన్ని ఎలుకలకు కరోనా వైరస్‌ ఎక్కించి, కొద్దిరోజుల తర్వాత వాటి నుంచి ఎముక కణజాలం సేకరించారు. స్కానింగ్‌ల సాయంతో ఆ నమూనాలను నిశితంగా విశ్లేషించారు. మహమ్మారి కారణంగా బాధితుల ఎముకల్లో 20% నుంచి 50% వరకూ నష్టం సంభవిస్తోందని, ముఖ్యంగా పొడవాటి ఎముకలు, వెన్నుపూసపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు. ‘‘కొవిడ్‌ కారణంగా ఎముకలు కాల్షియం, ఫాస్పేట్‌ వంటి ఖనిజాలను కోల్పోవడం (ఓస్టియోపీనియా), ఎముక కణజాలం విచ్ఛిన్నం కావడం (ఆస్టియోక్లాస్ట్‌) జరుగుతోంది. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించలేని పరిస్థితి (సైటోకీన్‌ డ్రైసెగ్యులేషన్‌) కూడా సంభవిస్తోంది. దీని కారణంగా ఆరోగ్యవంతమైన కణాలకూ హాని కలుగుతోంది’’ అని పరిశోధకులు వెల్లడించారు. ఇదే పరిస్థితి మనుషుల్లోనూ ఉండవచ్చని, దీర్ఘకాల కొవిడ్‌ బాధితులు ఎముకల ఆరోగ్యంపైనా దృష్టి సారించాలని వారు సూచించారు. ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ పత్రిక ఈ వివరాలు అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని