నేర విచారణ దుర్వినియోగం అడ్డుకట్టకు సుప్రీంకోర్టు నిరంతర యత్నం

నేర విచారణ ప్రక్రియను ప్రభుత్వాలు దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరంతరం ప్రయత్నిస్తోందని సర్వోన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు చెప్పారు. భిన్నాభిప్రాయాలు వినిపించేవారి గొంతు

Published : 16 Aug 2022 06:42 IST

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు

దిల్లీ: నేర విచారణ ప్రక్రియను ప్రభుత్వాలు దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరంతరం ప్రయత్నిస్తోందని సర్వోన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు చెప్పారు. భిన్నాభిప్రాయాలు వినిపించేవారి గొంతు నొక్కడానికి జరిగే ప్రయత్నాలకూ అడ్డుకట్ట వేస్తోందని తెలిపారు. సోమవారం దిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు. అధికారంలో ఉన్నవారికి సవాల్‌గా మారుతారని అనుకున్నవారి విషయంలో చట్టబద్ధ ప్రక్రియను దుర్వినియోగం చేయడం తగదని చెప్పారు. ఆరోపణల్లో ఏముందనే అంశంపై కొన్నిసార్లు దర్యాప్తు సంస్థలు తమ బుర్ర ఉపయోగించకముందే నేర విచారణ ప్రక్రియను మొదలుపెడుతుండడం వల్ల కేసుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. 2010-21 మధ్య దాదాపు 13,000 వరకు దేశద్రోహం కేసులు నమోదైతే 13 మందికే శిక్షలు పడ్డాయని గుర్తుచేశారు.

సిబల్‌ అభిప్రాయంతో ఏకీభవించను

సుప్రీంకోర్టుపై విశ్వాసాన్ని కోల్పోయినట్లు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్యతో తాను ఏకీభవించబోనని స్పష్టంచేశారు. సిబల్‌ ప్రస్తావించిన చాలా కేసులు ఆయన సొంతంగా వాదించినవేనని అన్నారు. కార్యనిర్వాహకవర్గ ఏకపక్ష చర్యలకు అడ్డుకట్ట వేయడంలో న్యాయవ్యవస్థది కీలకపాత్ర అని చెప్పారు. 75 ఏళ్లుగా వ్యక్తిగత హక్కుల్ని కాపాడుతున్న వ్యవస్థపై విశ్వాసం కోల్పోరాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని