ధర్మాసనాల్లో వైవిధ్యం ఉండాలి

రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో వైవిధ్యం ఉండాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు.

Published : 02 Oct 2022 04:57 IST

అప్పుడే సమాజమంతటికీ ప్రాతినిధ్య వేదికలవుతాయి

సుప్రీంకోర్టు విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, దిల్లీ: రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో వైవిధ్యం ఉండాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. విభిన్న వర్గాలకు ప్రాధాన్యమిచ్చినందువల్లే అత్యధిక మంది మహిళా న్యాయమూర్తులు తన హయాంలోనే నియమితులైనట్లు గుర్తుచేశారు. భారత దేశం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని చూడబోతోందన్నారు. ఏసియన్‌ ఆస్ట్రేలియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ శనివారం నిర్వహించిన జాతీయ సాంస్కృతిక భిన్నరూపత సదస్సులో.. ‘సాంస్కృతిక వైవిధ్యం...న్యాయవృత్తి’ అన్న అంశంపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. ‘నా దేశం వైవిధ్యాల నుంచే పుట్టింది. అందుకే ఇక్కడ ప్రజాస్వామ్యం, ప్రజాప్రాతినిధ్య పార్లమెంటు ఏర్పడ్డాయి. నియంతృత్వ, పెత్తందారీ పాలనలో సుసంపన్నమైన వైవిధ్యం మనుగడ సాగించలేదు. ప్రజాస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. రాజకీయాల్లో విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై చాలా దేశాలు దృష్టి సారించాయి. అయితే, న్యాయ వ్యవస్థలోనూ భిన్నత్వానికి పెద్దపీట వేయడానికి భారత్‌లాంటి కొన్ని దేశాలే ప్రాధాన్యమిచ్చాయి. ధర్మాసనాల్లో విభిన్నత ఉంటే అవి వివిధ అభిప్రాయాలకు వేదికలవుతాయి, ప్రభుత్వాల చట్టాలు, కోర్టుల తీర్పులు సమాజంలోని విభిన్న వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది సూక్ష్మంగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ధర్మాసనాల్లో విభిన్న వర్గాలకు అవకాశం కల్పించడం వల్ల తాము కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములమేనన్న భావన అన్ని వర్గాల్లో ఏర్పడుతుంది. భారత్‌లో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలు కొలీజియం వ్యవస్థ ద్వారా సాగుతాయి. ఇది ఈ దేశంలో మాత్రమే ఉన్న ప్రత్యేకమైన వ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావానికి గురికాకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడానికి కొలీజియం వ్యవస్థ అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు తీర్పుల ద్వారా చెప్పింది. నేను కొలీజయం సభ్యుడిగా పని చేసినప్పుడు, ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు పంపిన సిఫార్సుల్లో విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం. కేంద్ర ప్రభుత్వం దాదాపు వాటన్నింటినీ ఆమోదించింది. మా సిఫార్సుల కారణంగా సుప్రీంకోర్టులో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది మహిళా న్యాయమూర్తులు నియమితులు కాగలిగారని గర్వంగా చెబుతున్నా. దానివల్లే భారత దేశం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని చూడబోతోంది’అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని