మహాత్ముడి విలువలకు పునరంకితమవుదాం

జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు నేతలు ఆదివారం ఆ ఇద్దరికీ నివాళులు అర్పించారు. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించిన రాష్ట్రపతి.. గాంధీజీ నేర్పిన విలువలకు మనం పునరంకితం కావడానికి ఈ జయంతి ఒక సందర్భమన్నారు.

Published : 03 Oct 2022 03:33 IST

 గాంధీ, లాల్‌ బహదూర్‌లకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు నేతలు ఆదివారం ఆ ఇద్దరికీ నివాళులు అర్పించారు. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించిన రాష్ట్రపతి.. గాంధీజీ నేర్పిన విలువలకు మనం పునరంకితం కావడానికి ఈ జయంతి ఒక సందర్భమన్నారు. విజయ్‌ఘాట్‌లో శాస్త్రికి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్ముడికి నివాళులర్పించిన ప్రధాని మోదీ.. గాంధీ గౌరవార్థం ఖాదీ, హస్తకళల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘నిరాడంబరుడైన శాస్త్రి భారత చరిత్రలో చాలా కీలకమైన సమయంలో పటిష్ఠ నాయకత్వం అందించారు’’ అని ప్రశంసించారు. గాంధీ, శాస్త్రిలకు నివాళులర్పించిన ప్రముఖుల్లో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు ఉన్నారు.

సెంట్రల్‌హాలులో 99 మంది విద్యార్థులు

దేశంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి ఎంపిక చేసిన 99 మంది విద్యార్థులు ఆదివారం పార్లమెంటు సెంట్రల్‌హాలులో సందడి చేశారు. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఈ నేతల చిత్రపటాలకు ప్రముఖుల పుష్పాంజలి కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు బాపు, శాస్త్రిలకు నివాళులర్పించారు. దివంగత నేతల గురించి విద్యార్థుల బృందం నుంచి 30 మంది మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు