తీర్పుల్లో విలక్షణత

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా కీలకతీర్పుల్లో భాగస్వాములయ్యారు.

Published : 09 Nov 2022 04:32 IST

కీలక తీర్పులు వెలువరించిన జస్టిస్‌ చంద్రచూడ్‌
ఆధార్‌ బిల్లు ఆమోదం రాజ్యంగ విరుద్ధమని భిన్నాభిప్రాయం
ఐపీసీ 377 సెక్షన్‌.. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని తీర్పు

ఈనాడు, దిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా కీలకతీర్పుల్లో భాగస్వాములయ్యారు. వాటిని పరిశీలిస్తే.. ఆధార్‌ బిల్లును మనీ బిల్లుగా పాస్‌ చేయడం సరైందేనని మెజార్టీ న్యాయమూర్తులు తీర్పునిస్తే, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒక్కరే భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత గోప్యత, గౌరవం, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అలాగే నవ్‌తేజ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఐపీసీ 377 సెక్షన్‌.. ప్రాథమిక హక్కులు, సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ, జీవించే, గోప్యత హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు. మేజర్‌ అయిన వారికి  వివాహం, మతం విషయంలో తమకు నచ్చినట్లు నడుచుకొనే స్వేచ్ఛ ఉంటుందని సాఫిన్‌ జహాన్‌ వర్సెస్‌ అశోకన్‌ కేఎం కేసులో తీర్పు చెప్పారు. 10-50 ఏళ్ల మహిళలను శబరిమల ఆలయ ప్రవేశం నిషేధించడం రాజ్యాంగసూత్రాలకు విరుద్ధమని, అలాచేయడం వారి స్వతంత్రత, స్వేచ్ఛ, మర్యాదలను దెబ్బతీయడమేనని ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమికహక్కుల కిందికి వస్తుందని జస్టిస్‌ కేఎస్‌పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 2017 ఆగస్టులో ఏకగీవ్రంగా తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. వ్యభిచారం నేరంకాదని జోసెఫ్‌ షైన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజార్టీ తీర్పుతో ఏకీభవించారు. ఐపీసీ సెక్షన్‌ 497 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 (చట్టం ముందు అందరూ సమానం), 15 (మతం, వర్ణం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షచూపడం నిషేధం), 21 (జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ)కి విరుద్ధమని చెప్పారు. శతాబ్దాలుగా మహిళల అణచివేతకు దీన్ని ఉపయోగిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అభ్యర్థులు మతం పేరుతో ఓట్లు అడగరాదని, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆ రాష్ట్రానికి కార్యనిర్వాహక అధినేత కాదని వేర్వేరు తీర్పుల్లో చెప్పారు. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును విచారించే సమయంలో జరిగిన జడ్జి లోయ మరణంపై విచారణ జరిపించాలన్న కేసును డిస్మిస్‌ చేశారు.


రెండేళ్లకు పైగా సీజేఐలుగా 13 మంది
వారిలో నలుగురు బాంబే బార్‌ అసోసియేషన్‌ సభ్యులే

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఇప్పటి వరకూ 49 మంది బాధ్యతలు నిర్వహించగా వారిలో కేవలం 13 మంది మాత్రమే రెండేళ్లకు మించి సీజేఐ హోదాలో ఉన్నారు. వారిలో నలుగురు బాంబే బార్‌ అసోసియేషన్‌కు చెందినవారు కాగా, ఇప్పుడు ఆ వరుసలో అయిదో వ్యక్తిగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చేరుతున్నారు. ఆయన తన పుట్టినరోజుకు(నవంబరు 11) రెండు రోజుల ముందు బాధ్యతలు చేపట్టి రెండేళ్ల తర్వాత పుట్టిన రోజుకు ఒకరోజు పదవీ విరమణ చేయనున్నారు. ఇలా సరిగ్గా రెండేళ్ల కాలపరిమితి దక్కింది ఆయన ఒక్కరికే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు