జి-20 సారథ్యం మహత్తరం

జి-20 కూటమికి సారథ్యం వహించేందుకు మన దేశానికి మహత్తర అవకాశం లభించిందనీ, ప్రపంచ సంక్షేమానికి దీనిని ఉపయోగించుకుందామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 04:30 IST

ప్రపంచ సంక్షేమానికి ఈ అవకాశాన్ని వాడుకుందాం
సవాళ్లకు పరిష్కారాలు మనం చూపగలం
మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: జి-20 కూటమికి సారథ్యం వహించేందుకు మన దేశానికి మహత్తర అవకాశం లభించిందనీ, ప్రపంచ సంక్షేమానికి దీనిని ఉపయోగించుకుందామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. శాంతి, ఐక్యత, పర్యావరణం, సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఎదురవుతున్న సవాళ్లకు తగిన పరిష్కారాలు మనవద్ద ఉన్నాయని చెప్పారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవితవ్యం’ అనే నినాదాన్ని మనదేశం ఇవ్వడానికి కారణం వసుధైక కుటుంబ భావనేనని చెప్పారు. ‘ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభాకు జి-20 కూటమి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో 3/4వ వంతు, జీడీపీలో 85% ఈ కూటమి దేశాల్లోనే ఉంటుంది. అంతటి భారీ, శక్తిమంతమైన కూటమికి వచ్చే నెల ఒకటోతేదీ నుంచి మనదేశం సారథ్యం వహించబోతోంది. ఇదెంతటి గొప్ప అవకాశమో ఊహించండి. ప్రతి భారతీయునికీ లభించిన అవకాశమిది. ఆజాదీకా అమృత్‌ కాలంలో ఈ బాధ్యతలు దక్కడం మనకు మరింత ప్రత్యేకం’ అని ప్రధాని పేర్కొన్నారు. అందరి సంక్షేమం, శాంతి, శ్రేయస్సులను కోరేలా, ఆకాంక్షలను నెరవేర్చేలా మన బాధ్యతలు ఉంటాయని చెప్పారు. జి-20కి సంబంధించి, రాబోయే రోజుల్లో దేశంలో వేర్వేరు కార్యక్రమాలు ఉంటాయనీ, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మన రాష్ట్రాల సందర్శనకు రానున్నారని తెలిపారు. వీరిద్వారా మన రాష్ట్రాల సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పవచ్చనీ, ప్రస్తుతం ప్రతినిధులుగా వచ్చేవారు భవిష్యత్తులో పర్యాటకులు అవుతారని వివరించారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఏదో ఒక రూపంలో జి-20లో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు.

అంతరిక్ష విజయాలతో హృదయాలు ఉప్పొంగుతున్నాయి

జీ20 లోగోను చేనేత మగ్గంపై తయారుచేసి ప్రత్యేక బహుమతిగా తనకు పంపిన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ను, గ్రంథాలయ పురుషునిగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్‌ వాసి సంజయ్‌ కశ్యప్‌ను మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. జీ-20 సభ్య దేశాలతో వ్యాపార సంబంధాలున్న రాష్ట్రాలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతామని తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ మరిన్ని విజయాలు సాధిస్తోందని కితాబు ఇచ్చారు. ఇటీవల విక్రమ్‌-ఎస్‌ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించినప్పుడు ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిందని చెప్పారు. చిన్నప్పుడు కాగితపు విమానాలను ఎగరేసే పిల్లలు ఇప్పుడు దేశంలోనే రాకెట్లను, విమానాలను తయారుచేసే అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. అంతరిక్ష రంగంలో మన విజయాలను పొరుగు దేశాలతోనూ పంచుకుంటున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని