Brij Bhushan: ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలివ్వండి.. రెజ్లర్లను కోరిన దిల్లీ పోలీసులు!

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే ఫొటోలు, వీడియోలు, వాట్సప్‌ సందేశాలుంటే తమకు సమర్పించాలని దిల్లీ పోలీసులు మహిళా రెజ్లర్లను (Wrestlers) కోరినట్లు సమాచారం.

Updated : 11 Jun 2023 14:51 IST

భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh) తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై దిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలుంటే సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు కోరినట్లు సమాచారం. ఫొటోలు, వీడియోలు, వాట్సప్‌ సంభాషణలు ఏవి ఉన్నా తమకు అందజేయాలని పోలీసులు కోరినట్లు తెలిసింది. పోలీసులు కూడా సొంతంగా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. 

దిల్లీ పోలీసులు రెజ్లర్లకు సీఆర్‌పీసీ 91 నోటీసులు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటి ప్రకారం కేసు విచారణకు అవసరమైన ఎలాంటి పత్రాలనైనా దర్యాప్తు అధికారి కోరవచ్చు. అందులో భాగంగా ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా తమకు అందజేయాలని ఆరోపణలు చేసిన రెజ్లర్లను కోరారు.

ఇదిలా ఉండగా బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తన సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండాలో ఇవాళ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాడు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని తక్షణమే భాజపా నుంచి బహిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన బలం ఏంటో తెలియజేసేందుకే బ్రిజ్‌ భూషణ్‌ ఈ ర్యాలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఇటీవల భారత అగ్రశ్రేణి రెజర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొన్ని రోజుల పాటు దీక్ష (Wrestlers Protest) చేపట్టిన విషయం తెలిసిందే. వీరి ఆందోళన ఇటీవల ఉద్ధృతమవడంతో స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. వారితో చర్చలు జరిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో.. రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని