Goa: పర్యాటకుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోం.. సీఎం సావంత్‌ గట్టి వార్నింగ్‌

ఇటీవల అమెరికా నుంచి వచ్చిన టూరిస్టుల పట్ల ట్యాక్సీ డ్రైవర్లు వ్యవహరించిన తీరుపై గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌(Pramod sawant) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల్ని(Tourists) వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Published : 20 Dec 2022 01:37 IST

పనాజీ: ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న గోవా(Goa)కు వచ్చే టూరిస్టుల్ని వేధింపులకు గురిచేసేవారికి సీఎం ప్రమోద్‌ సావంత్‌(Pramod sawant) గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుల్ని ఇబ్బందులు పెట్టేవారిని వదిలిపెట్టబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించేందుకు భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్‌ విజయ్‌’కు గుర్తుగా ఏటా డిసెంబర్‌ 19న జరుపుకొనే గోవా లిబరేషన్‌ డే వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడారు. తమ రాష్ట్రంలోని పర్యాటక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఆ రంగం అభివృద్ధికి ట్యాక్సీ, టూర్‌ ఆపరేటర్ల సహకారం ఎంతో అవసరమన్నారు. అలాగే, అంతర్జాతీయంగా పర్యాటక రంగానికి సంబంధించి గోవాకు ఓ పాజిటివ్‌ ఇమేజ్‌ని సృష్టించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీచ్‌, ఎకో టూరిజం, వెల్‌నెస్‌, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాలను విభిన్న కోణాల్లో అన్వేషిస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇటీవల గోవా అందాలను వీక్షించేందుకు మోర్ముగావ్‌ ఓడరేవుకు క్రూజ్‌ నౌకలో చేరుకున్న అమెరికా పర్యాటకుల బృందం పట్ల అక్కడి ట్యాక్సీ డ్రైవర్లు వ్యవహరించిన తీరు పట్ల సీఎం సావంత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. క్రూజ్‌ నౌకలో గోవాకు చేరుకున్న 100 మంది అమెరికా టూరిస్టుల కోసం క్రూజ్‌ సిబ్బంది ఏర్పాటు చేసిన బస్సుల్ని ట్యాక్సీ డ్రైవర్లు అడ్డుకున్నారు. బస్సు డ్రైవర్‌తో గొడవకు దిగారు. తమను బస్సుల్లో ఎక్కనీయకుండా అడ్డుకున్న ట్యాక్సీ డ్రైవర్ల ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తంచేసిన అమెరికా టూరిస్టులు అక్కడి నుంచి మళ్లీ క్రూజ్‌ నౌక ఎక్కి కేరళకు వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై క్రూజ్‌ ఆపరేటర్లు సీఎం సావంత్‌ను కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం ఈరోజు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు తమ పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయన్నారు. అలాగే, మైనింగ్‌ అంశంపైనా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ బ్లాక్‌లను వేలం వేయగలిగిందని.. ఇది సమీప భవిష్యత్తులోనే రాష్ట్రంలో మైనింగ్‌ కార్యకలాపాలు తిరగి ప్రారంభించడంలో దోహదపడుతుందన్నారు. భూకబ్జాలకు పాల్పడే వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని