Fake News: నకిలీ వార్తల వ్యాప్తి.. 94 యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం నిషేధం!

సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరికొన్ని సోషల్‌ మీడియా ఖాతాలు..........

Published : 22 Jul 2022 01:59 IST

రాజ్యసభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరికొన్ని సోషల్‌ మీడియా ఖాతాలు, యూట్యూబ్‌ ఛానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 2021-22 మధ్య కాలంలో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్‌ ఛానెళ్లు, 19 సోషల్‌ మీడియా ఖాతాలు, 747 URLలపై నిషేధం విధించినట్లు వెల్లడించింది. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

డిజిటల్‌ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ - 2020 కింద గతేడాది ఫిబ్రవరి 25 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌ 2021ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. దాని ప్రకారం ఏదైనా యూట్యూబ్‌ ఛానెల్‌, సోషల్‌ మీడియా ఖాతా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కోడ్‌లు ఉల్లంఘించినట్లు గుర్తించినట్లయితే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అలానే నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఆధ్యర్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2009 నవంబర్‌లో నిజనిర్ధారణ విభాగాన్ని (Fact checking unit) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విభాగం ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయడంతోపాటు, స్వయంగా విచారణ జరిపిన అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చేరవేస్తుందన్నారు. వాటితోపాటు సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలకు సంబంధించి వ్యాప్తి చెందుతున్న వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌, పోల్స్‌ గుర్తించి వాటికి సంబంధించిన నిజమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తుందని మంత్రి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు రూపొందించాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. దానితోపాటు సోషల్‌ మీడియాలో కంటెంట్‌ నియంత్రణ, వాటిపై వచ్చే అభ్యంతరాలను విచారించేందుకు ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని