
Uttarakhand Rains: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న హైదరాబాద్ యువతులు
క్షేమంగా బయటపడ్డారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్
హైదరాబాద్: భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరదల్లో హైదరాబాద్‌కు చెందిన యువతులు చిక్కుకుపోయారు. సెలవుల్లో విహారయాత్రకు వెళ్లిన ఆరుగురు యువతులు.. వరదల కారణంగా ఓ హోటల్‌లో చిక్కుకుపోయారు. వీరి గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడి వారిని రక్షించారు.
హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి రాధాకృష్ణ నగర్ ప్రాంతానికి చెందిన సుష్మ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. గతవారం దసరా సెలవుల సందర్భంగా సుష్మ, మరో ఐదుగురు యువతులతో కలిసి ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లారు. అయితే కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. సుష్మ బృందం ఉంటున్న జిమ్ కార్బెట్ పార్క్‌లోని లెమన్ ట్రీ రిసార్ట్‌లోకి కూడా వరద నీరు పోటెత్తింది. దీంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు.
రిసార్ట్ బిల్డింగ్ మూడో అంతస్తుపై తాము చిక్కుకుపోయామని, రెండవ అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నట్లు బాధితులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. తమను కాపాడేందుకు అధికారులెవరూ రావట్లేదని వాపోయారు. దీంతో యువతుల తల్లిదండ్రులు మల్కాజ్‌గిరి స్థానిక నేతలను కలిసి తమ పిల్లలను రక్షించమని కోరారు. అటు రాధాకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి వెంటనే ఉత్తరాఖండ్‌లోని స్థానిక అధికారులతో మాట్లాడి వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘ఆందోళన చెందొద్దు. రిసార్ట్‌లో చిక్కుకున్న సుష్మ, స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడాను. అవసరమైన సాయం అందించాం. ప్రస్తుతం సుష్మ బృందం క్షేమంగా ఉంది. వారంతా దిల్లీ బయల్దేరారు’’ అని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.