Corona: పిల్లలకు మూడో ముప్పు.. స్పష్టత లేదు!

గతఏడాది కాలంలో కరోనా రెండు దఫాలుగా విజృంభించిన కరోనా చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపలేదు.

Published : 08 Jun 2021 12:03 IST

పెద్దలు టీకా వేయించుకుంటేనే చిన్నారులకు రక్ష

దిల్లీ: గతఏడాది కాలంలో రెండు దఫాలుగా విజృంభించిన కరోనా మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే మూడోదశలో మాత్రం వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందనే నిపుణుల అభిప్రాయాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకు తగ్గట్టుగా అప్రమత్తం అవుతున్నాయి. అయితే తదుపరి దశలో కరోనాతో పిల్లలకు ముప్పు పొంచి ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం వెల్లడించింది. దీనిపై ప్రధాని కొవిడ్ నిర్వహణ బృందంలో ఒకరైన వీకే పాల్ మీడియాతో మాట్లాడారు.

‘మూడో దశ.. పిల్లలపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుందనడంపై స్పష్టత లేదు. ఇప్పటివరకు పెద్దల మాదిరిగానే పిల్లలు ప్రభావితం అయ్యారు’ అని ఆయన వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ఆధారంగా.. సీరో ప్రివలెన్స్‌ రేటు అదే విషయాన్ని వెల్లడిచేసిందన్నారు. అలాగే రానున్న దశలో వారికి అధికంగా ఈ వైరస్ సోకుతుందని రుజువు చేసే ఆధారాలు లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కూడా మీడియాకు వెల్లడించారు. 

మరోపక్క కరోనా టీకాపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చిన్నారులను రక్షించుకునేందుకు టీకా వేయించుకోవాలని తల్లిదండ్రులను కోరుతోంది. పెద్దలు టీకాలు వేసుకుంటే, పిల్లలకు వైరస్ సోకే అవకాశం చాలామటుకు తగ్గిపోతుందని వీకే పాల్ అన్నారు. అలాగే పిల్లలపై మూడో ముప్పు ప్రభావానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేనందున.. తల్లిదండ్రులను ఆందోళన గురిచేయొద్దని ఇండియన్ పీడియాట్రిక్స్ అసోసియేషన్ కోరింది. తదుపరి దశలో పసిపిల్లల్లో తీవ్ర లక్షణాలు ఉండొచ్చనే వాదనను నిపుణులు తోసిపుచ్చారు. రెండు దశల్లో భాగంగా సేకరించిన వివరాల ప్రకారం.. కొద్దిశాతం మందికి మాత్రమే తీవ్ర లక్షణాలు కనిపిస్తాయని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని