Modi-Biden: ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం: మోదీ

అమెరికాలోని వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంయుక్తంగా మాట్లాడారు.

Updated : 22 Jun 2023 21:55 IST

వాషింగ్టన్‌: ప్రజా ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా భారత్‌, (India) అమెరికా (America) పని చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాల వ్యవస్థలు, సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మించి ఉన్నాయని చెప్పారు. అమెరికాలో (USA) తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు, 4 మిలియన్ల భారతీయ అమెరికన్లకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి వైట్‌హౌస్‌కు (White House) చేరుకున్నారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) దంపతులు ఘనస్వాగతం పలికారు. ఆయనకు గౌరవ సూచకంగా సైనికులు 19 రౌండ్‌లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ  మాట్లాడుతూ.. 3 దశాబ్దాల క్రితం సామాన్యుడిగా అమెరికా పర్యటనకు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.

‘‘నాడు వైట్‌ హౌస్‌ను బయట నుంచి చూశాను. ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికా పర్యటనకు వచ్చాను. తాజాగా పెద్ద ఎత్తున జన నీరాజనాలతో తొలిసారి వైట్‌హౌస్‌ ద్వారాలు తెరచుకున్నాయి. అమెరికాలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నారు. భారతీయులు తమ నిబద్ధత, నైపుణ్యంతో దేశ గౌరవాన్ని పెంపొందించారు. కొవిడ్ విపత్తువేళ ప్రపంచం కొత్త రూపు సంతరించుకుంది. ఇరుదేశాల స్నేహం విశ్వ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదం చేసింది. ప్రపంచ ఆహారం కోసం ఇరుదేశాలు కలిసి పని చేసేందుకు కంకణబద్ధులై ఉన్నాయి. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

భారత్‌-అమెరికా మధ్య బంధం చాలా గొప్పది : బైడెన్‌

భారత్‌, అమెరికా మధ్య బంధం చాలా గొప్పదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. ఇరుదేశాల మధ్య సారూప్య విలువలు ఉన్నట్లు చెప్పారు. ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యేక బంధం ఏర్పడిందన్నారు. రెండు గొప్ప దేశాలు, రెండు గొప్ప శక్తులు, ఇద్దరు గొప్ప స్నేహితులు 21వ శతాబ్ద గమనాన్ని నిర్వచించగలరని ఈ సందర్భంగా బైడెన్‌ వ్యాఖ్యానించారు. విశ్వాసమే మా ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత దృఢంగా తయారు చేసిందన్నారు. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా భారత్‌-అమెరికా కలిసి పని చేయడం చాలా అవసరమని బైడెన్‌ అన్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులను పరిష్కరించడం, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత తదితర అంశాల్లో ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని గుర్తు చేశారు.

అమెరికన్ల జీవితాల్లో ఇండో అమెరికన్లు భాగస్వామ్యమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని బైడెన్‌ తెలిపారు. వారు ఇరు దేశాలకు వారధి లాంటివారని అన్నారు. వైట్‌హౌస్‌లోనూ, కాంగ్రెస్‌లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అందుకు చక్కని ఉదాహరణ అని చెప్పారు. సాంకేతిక రంగంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో సామాజికంగా, ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని బైడెన్‌ తెలిపారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఆర్థిక భాగస్వాములు ఆకర్షించే అవకాశం ఇరు దేశాలకూ ఉందని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని