టీకా పంపిణీ: కోటి మార్కును దాటిన భారత్‌!

దేశవ్యాప్తంగా ఒక కోటి(1,01,88,007)డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన కేవలం 35రోజుల్లో కోటి మార్కును దాటినట్లు పేర్కొంది.

Published : 19 Feb 2021 13:48 IST

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా, వ్యాక్సిన్‌ పంపిణీని భారత్‌ వేగంగా చేపడుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక కోటికిపైగా (1,01,88,007)డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన కేవలం 35రోజుల్లో కోటి మార్కును దాటినట్లు పేర్కొంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను వేగంగా చేపడుతోన్న దేశాల్లో అమెరికా, బ్రిటన్‌లు ముందుండగా, భారత్‌ మూడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే తెలిపింది.

35రోజుల్లోనే..

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని జవవరి 16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. ఇలా గడిచిన 35రోజుల్లోనే కోటి లక్షా 80వేల వ్యాక్సిన్‌ డోసులను అందించారు. దాదాపు 65లక్షల మంది వైద్యారోగ్య సిబ్బంది తొలి డోసు తీసుకోగా, వీరిలో 4లక్షల మందికి రెండో డోసు అందించారు. వీరితో పాటు మరో 30లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కూడా టీకా‌ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తొలి డోసు తీసుకున్న వారికి 28 రోజుల వ్యవధి అనంతరం రెండో డోసు ( ఫిబ్రవరి 13నుంచి) ఇస్తున్న విషయం తెలిసిందే.

మూడోస్థానంలో భారత్‌..

కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా పంపిణీ చేస్తోన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. కేవలం 31రోజుల్లోనే అక్కడ కోటి వ్యాక్సిన్‌ డోసులను అందించారు. అమెరికాలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించి ప్రస్తుతం 66 రోజులు పూర్తికాగా, ఇప్పటి వరకు ఐదున్నర కోట్ల డోసులను పంపిణీ చేశారు. తొలిసారిగా అధికారికంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన బ్రిటన్‌లో ఈ ప్రక్రియ మొదలై 72రోజులు అయ్యింది. ఇప్పటికే అక్కడ కోటి 65లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు సమాచారం. తాజాగా భారత్‌ 35రోజుల్లో కోటి డోసుల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా 19కోట్ల మందికి..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగానే కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ఇప్పటికే 82దేశాలు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టాయి. ఇప్పటి వరకు దాదాపు 19కోట్ల మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సమాచారం. వ్యాక్సిన్‌ పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ఐరోపా సంఘం‌, బ్రిటన్‌లలోనూ ఈ ప్రక్రియ వేగంగానే కొనసాగుతోంది. అటు ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌ దేశాలు వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా చేపడుతున్నాయి. అయితే, చైనాలోనూ వ్యాక్సినేషన్‌ భారీ స్థాయిలో చేపడుతున్నప్పటికీ, వాటికి సంబంధించిన అధికారిక సమచారం అందుబాటులో లేదు. ఇక కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తొలిసారిగా రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించిన రష్యాలో మాత్రం ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని