Cyclone Biparjoy: ముంచుకొస్తున్న ముప్పు.. రంగంలోకి దిగిన భారత సైన్యం

బిపోర్‌జాయ్‌ తుపాను (Biparjoy Cyclone) ప్రభావం గుజరాత్‌పై అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో భారత సైన్యం (Indian Army) కూడా రంగంలోకి దిగింది.

Published : 13 Jun 2023 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిపోర్‌జాయ్‌ తుపాను (Biparjoy Cyclone) ప్రభావం గుజరాత్‌పై అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. దీంతో విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే సంసిద్ధమవుతుండగా.. తాజాగా భారత సైన్యం (Indian Army) కూడా రంగంలోకి దిగింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అవసరమైన సామగ్రితో ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉంది.

గుజరాత్‌లోని జఖౌ తీరంలో గురువారం సాయంత్రం బిపోర్‌జాయ్ తుపాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ అంచనా చేసింది. ప్రస్తుతం ఇది కాస్త బలహీనపడినప్పటికీ.. తీరం దాటే సమయంలో తీవ్ర విధ్వంసం సృష్టించే సామర్థ్యం దీనికి ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపట్టేందుకుగాను సిద్ధంగా ఉన్నామని భారత సైన్యం పేర్కొంది. ముఖ్యంగా భుజ్‌, జామ్‌నగర్‌, గాంధీధామ్‌, ధ్రగంధర, వడోదరా, గాంధీనగర్‌తోపాటు నలియా, ద్వారక, అమ్రేలీ ప్రాంతాల్లో తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. బాధితులకు ఆహారం, నీరు, తాత్కాలిక వసతి కల్పించడంతోపాటు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వారిని రక్షించేందుకు అవసరమైన సామగ్రితో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు తుపాను ప్రభావంతో ద్వారక తీరంలో ఓ ఆయిల్‌ రిగ్‌లో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని కోస్ట్‌గార్డ్‌ కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని