Hijab: హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం: కర్ణాటక సీఎం

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధారణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. 

Published : 23 Dec 2023 02:16 IST

బెంగళూరు: హిజాబ్‌ (Hijab) వివాదంపై కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. మైసూర్‌లో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిజాబ్‌పై నిషేధం ఎత్తివేస్తున్నామని, మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని వెల్లడించారు. 

‘‘ఇకపై రాష్ట్రంలో హిజాబ్‌పై నిషేధం ఉండదు. మహిళలు హిజాబ్‌ ధరించి ఎక్కడికైనా వెళ్లొచ్చు. నిషేధం ఎత్తివేతకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాను. రాష్ట్రంలోని మహిళలు ఏ దుస్తులు ధరించాలి.. ఏం తినాలి అనేది వారి ఇష్టం. నేనేందుకు వాళ్లను అడ్డుకోవాలి? ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించడంలో తప్పేముంది? ’’అని సిద్ధరామయ్య అన్నారు. శనివారం నుంచే ఈ నిర్ణయం అమలు కానున్నట్లు తెలిపారు. 

గత భాజపా ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పలువురు పిటిషన్‌ దాఖలు చేయగా కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని తీర్పునిచ్చింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని