Lakshadweep: ఎంపీకి పదేళ్ల జైలు.. లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు

ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ (Lakshadweep) ఎంపీకి ఇటీవల పదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ (Lok Sabha) సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 14 Jan 2023 14:50 IST

దిల్లీ: లక్షద్వీప్‌ (Lakshadweep) ఎంపీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేత మహ్మద్‌ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. హత్యాయత్నం కేసులో ఇటీవల ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో తన (MP) సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి లోక్‌సభ (Lok Sabha) సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఓ కేసుకు సంబంధించి కవరత్తిలోని సెషన్స్‌ కోర్టు జనవరి 11న  తీర్పు వెలువరించగా.. అదే రోజు నుంచే ఈ అనర్హత వేటు అమలులోకి వస్తుందని లోక్‌సభ సెక్రటేరియట్‌ స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పీఎం సయీద్‌ అల్లుడు పదాంత సాలిహ్‌పై మహ్మద్‌ ఫైజల్‌తోపాటు మరికొందరు హత్యాయత్నానికి పాల్పడినట్లు 2009లో కేసు నమోదయ్యింది. మారణాయుధాలతో దాడి చేసి గాయపర్చినప్పటికీ.. బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగిన ఈ ఘటన.. రాజకీయ కక్షలతోనే జరిగిందనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌తోపాటు నలుగురిని దోషిగా తేల్చింది. వీరికి పదేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. అయితే, ఎన్సీపీ నేత మహ్మద్‌ ఫైజల్‌ 2014 నుంచి లక్షద్వీప్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఈ తీర్పును సవాలు చేస్తూ ఫైజల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని