ఉచిత టీకా పంపిణీకి మహారాష్ట్ర నిర్ణయం!

కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు ఆయా రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజలకు ఉచితంగానే పంపిణీ చేస్తామని మంత్రి నవాబ్‌ మాలిక్‌ వెల్లడించారు.

Published : 25 Apr 2021 15:14 IST

ముంబయి: కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు ఆయా రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు ఉచితంగానే పంపిణీ చేస్తామని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌ చర్చించిందని.. త్వరలోనే వీటికి అవసరమైన టెండర్లను పిలుస్తామని తెలిపారు. తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగానే టీకా పంపిణీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో 10రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ముంబయిలో మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా..

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన కేంద్రాల్లో టీకా పంపిణీ కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో టీకా పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. దీంతో డోర్‌-టూ-డోర్ వ్యాక్సినేషన్‌ నిర్వహించాలనే డిమాండ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రణాళిక లేదని ముంబయి మునిసిపల్‌ అధికారులు స్పష్టం చేశారు. మూడోదశ టీకా పంపిణీ(మే 1)లో ముంబయిలో మొబైల్‌ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ వ్యాక్సిన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మే 1 తేదీ నుంచి మూడో విడతలో భాగంగా 18ఏళ్ల వయసుపైబడిన వారందరికీ టీకా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు 45ఏళ్ల వయసుపైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తుంది. టీకా పంపిణీపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని వెల్లడించింది. తయారీ సంస్థలనుంచి 50శాతం డోసులు కేంద్రానికి, మరో 50శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నేరుగా తయారీ సంస్థలనుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉచింతగా టీకా అందిస్తామని ప్రకటిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే టీకాలను మాత్రం ఉచితంగా అందజేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని