‘కూడు-గూడు’ ఆదేశాలపై వెనక్కితగ్గిన మణిపూర్‌

మయన్మార్‌ నుంచి వస్తున్న శరణార్థులకు ఆహారం, ఆవాసం కల్పించొద్దంటూ ఇచ్చిన ఆదేశాలపై మణిపూర్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన

Published : 30 Mar 2021 13:21 IST

ఇంఫాల్‌: మయన్మార్‌ నుంచి వస్తున్న శరణార్థులకు ఆహారం, ఆవాసం కల్పించొద్దంటూ ఇచ్చిన ఆదేశాలపై మణిపూర్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మయన్మార్‌లో చెలరేగిన సైనిక హింసాకాండతో అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఈ క్రమంలో వేలాది మంది మయన్మార్‌ వాసులు భారత్‌కు వలస వచ్చే అవకాశమున్న నేపథ్యంలో వారిని కట్టడిచేసేందుకు సరిహద్దు రాష్ట్రమైన మణిపూర్‌ ఇటీవల చర్యలకు ఉపక్రమించింది. వలసదారులకు భోజన సదుపాయం, వసతి కల్పించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయొద్దంటూ ఈ నెల 26న చండేల్‌, టెంగోన్‌పాల్‌, కామ్‌జాంగ్‌, ఉర్కుల్‌, చూరాచాంద్‌పూర్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిని సున్నితంగా వెనక్కి తిప్పిపంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే గాయాలపాలై వచ్చిన వారికి మానవతా దృక్పథంతో వైద్యసేవలు అందించాలని సూచించింది.

మణిపూర్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ పలువురు మండిపడ్డారు. దీంతో ఈ ఆదేశాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు సోమవారం రాత్రి మరో అడ్వైజరీ జారీ చేసింది. ‘‘మార్చి 26న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వక్రీకరించినట్లు, తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు అన్పిస్తోంది. మానవతా దృక్పథంతో మయన్మార్‌ శరణార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తోంది. గాయపడిన వారికి చికిత్స కూడా అందిస్తోంది. అయితే ఇందులో ఎలాంటి అపార్థాలకు తావులేకుండా గత ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది’’ అని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి జ్ఞాన్‌ ప్రకాశ్ తెలిపారు. 

మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సైన్యం ప్రజలపై కాల్పులు జరపడం అక్కడ సర్వసాధారణమైపోయింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది పొరుగుదేశాలకు వలసవెళ్తున్నారు. ఇప్పటికే మిజోరంలో వెయ్యి మందికి పైగా మయన్మార్‌ వాసులు ఆశ్రయం పొందినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts