Hanuman Jayanti: నవమి అల్లర్ల ఎఫెక్ట్‌.. హనుమాన్‌ జయంతికి కేంద్రం అడ్వైజరీ

హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సూచించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

Updated : 05 Apr 2023 15:08 IST

దిల్లీ: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రేపటి (ఏప్రిల్‌ 6) హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ (MHA) ట్విటర్‌లో వెల్లడించింది.

‘‘హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) ఏర్పాట్ల నిమిత్తం అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పండగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ముప్పును నిరంతరం పర్యవేక్షించాలి’’ అని హోంశాఖ రాష్ట్రాలను కోరింది.

శ్రీరామనవమి సందర్భంగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

కేంద్రం సాయం తీసుకోండి: కోల్‌కతా హైకోర్టు

నవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దుకాణాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనల దృష్ట్యా కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హనుమాన్‌ జయంతి ఉత్సవాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రం అభ్యర్థనను స్వీకరించి కేంద్ర బలగాలు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి వేసిన పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని