అప్పటి వరకు పాఠశాలలు బంద్‌

కొవిడ్-19 పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని తాము హామీ ఇచ్చేవరకు పాఠశాలలు తెరుచుకోవని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు.

Published : 26 Nov 2020 20:42 IST

వెల్లడించిన దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: కొవిడ్-19 పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని తాము హామీ ఇచ్చేవరకు పాఠశాలలు తెరుచుకోవని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘గత మూడు వారాల్లో దిల్లీలో పాజిటివిటీ రేటు 8.5 శాతానికి తగ్గింది. టీకా త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. కొవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు, పాఠశాలలు తెరుచుకోవు’ అని వెల్లడించారు. 

దిల్లీ పర్యావరణ శాఖ మంత్రికి కరోనా
దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను. దాంట్లో పాజిటివ్‌గా తేలింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని మంత్రి గురువారం ట్వీట్ చేశారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తరవాత కొవిడ్ బారిన పడిన మూడో మంత్రి ఈయన. 

ఇదిలా ఉండగా..గడిచిన 24 గంటల్లో రాజధాని నగరంలో 5,246 మంది వైరస్ బారిన పడగా..99 మంది మరణించారు. గత ఐదు రోజుల తరవాత 100కు దిగువన మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అక్కడ 5.45 లక్షల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 8,700 మార్కును దాటింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని