Baby Berth: తల్లీబిడ్డకు సౌకర్యవంత ప్రయాణం.. రైలులో ప్రయోగాత్మకంగా బేబీ బెర్త్‌!

ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శిశువులతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఓ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది...

Updated : 10 May 2022 15:19 IST

దిల్లీ: ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఓ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అదే ఫోల్డబుల్‌ ‘బేబీ బెర్త్‌’. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడక ఇది. లోయర్‌ బెర్త్‌కు అటాచ్‌ అయి ఉంటుంది. ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్‌పై తమ శిశువులను పడుకోబెట్టోచ్చు. సాధారణంగా అయితే.. ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డ సర్దుబాటు కావాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక.. ఇబ్బందులు తప్పేవి కావు. ఇప్పుడు బేబీ బెర్త్‌ సాయంతో బుజ్జాయిలను తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టొచ్చు.

మాతృదినోత్సవం సందర్భంగా ఉత్తర రైల్వే మండలం ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. లఖ్‌నవూ, దిల్లీ డివిజన్ల సమన్వయంతో.. లఖ్‌నవూ మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని త్రీ-టైర్ బీ4 కోచ్‌లో ఈ బెర్త్‌లను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసింది. ఈ విషయమై లఖ్‌నవూ డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ.. ‘బేబీ బెర్త్‌ను మెయిన్ లోయర్ బెర్త్‌తో జతచేశాం. అవసరం లేనప్పుడు దీన్ని లోయర్‌ బెర్త్‌ కిందికి మడతపెట్టొచ్చు. దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం’ అని వివరించారు. 770 మి.మీల పొడవు, 255 మి.మీల వెడల్పు, 76.2 మి.మీల ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్‌కు శిశువును సురక్షితంగా పట్టి ఉంచడానికి పట్టీలూ ఉన్నాయని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని